దక్షిణాఫ్రికాతో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా చవి చూసిన ఓటమి.. చర్చనీయాంశమైంది. ఏకంగా 358 పరుగుల భారీ స్కోర్ సాధించినా గానీ విజయాన్ని అందుకోలేకపోయింది
పట్టువదలని ప్రొటీస్ పోరాటం ముందు తలవంచింది. వారి ముందు బౌలింగ్ అస్త్రాలేవీ పని చేయలేవు. బ్యాటర్లు చెలరేగినప్పటికీ బౌలర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికన్ల ధాటికి మోకరిల్లారు.
తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ బాదాడు. 93 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. అతనికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ సైతం మూడంకెల స్కోర్ అందుకున్నాడు. 83 బంతుల్లో రెండు సిక్సర్లు, డజను ఫోర్లతో 105 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతనికి ఇది తొలి వన్డే సెంచరీ. కేప్టెన్ కేఎల్ రాహుల్ 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఈ భారీ స్కోర్ ను ఊది అవతలపడేసింది. 49.2 ఓవర్లల్లో ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే 362 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయింది. అందులో ఒకటి రిటైర్డ్ హర్ట్. ఓపెనర్ ఎయిడెన్ మార్క్ రమ్ సెంచరీతో కదం తొక్కాడు. కేప్టెన్ టెంబా బావుమా- 46, మాథ్యూ బ్రీట్జ్కె- 68, డెవాల్డ్ బ్రేవిస్- 54, టోనీ డీ జోర్జీ- 17 (రిటైర్డ్ హర్ట్) ధాటిగా ఆడారు. చివర్లో కార్బిన్ బాష్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
ప్రత్యేకించి రుతురాజ్ గైక్వాడ్ కు.. ఈ ఓటమి మింగుడుపడనిది. వన్డేల్లో అతను తొలి సెంచరీ చేసిన గేమ్ ఇది. అటు సెంచరీ, ఇటు రికార్డు స్థాయి స్కోర్ అయినా మ్యాచ్ ను కాపాడుకోలేకపోయింది భారత్. ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో కూడా టీ20 ఇంటర్నేషనల్స్ లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసిన మ్యాచ్ ఓ పరాజయాన్ని మూటగట్టుకుంది. 200లకు పైగా భారీ స్కోర్ చేసినా గానీ మ్యాచ్ లో ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అది. 2023 నవంబర్ 28న గువాహటి వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 123 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం ఈ స్కోర్ ను అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది ఆస్ట్రేలియా. గ్లెన్ మ్యాక్స్ వెల్ సెంచరీ కొట్టాడందులో. 48 బంతుల్లోనే ఎనిమిది సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 104 పరుగులతో సునామీ ఇన్నింగ్ ఆడాడు. విచిత్రం ఏమిటంటే.. ఈ రెండు కూడా ఆయా ఫార్మట్లల్లో అతని తొలి సెంచరీలే.
