రేవు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు, ఎస్ఐఆర్ వివాదాల నేపథ్యంలో అధికార ఎన్డీయేను ఇరుకునపెట్టేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్షం అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది
ఇలాంటి సమయంలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి కూడా ఢిల్లీ పోలీసులు భారీ షాకిచ్చారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేటెడ్ జర్నల్స్ అనే సంస్థను రాహుల్, సోనియా నేతృత్వలోని యంగ్ ఇండియా స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్ధిక నేరాల విభాగం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ రాహుల్, సోనియాపై తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరితో పాటు మొత్తం ఆరుగురిని ఇందులో చేర్చింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) నిబంధన ఢిల్లీ పోలీసులకు ఈడీ ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తోంది. దీంతో ఈడీ చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో రాహుల్, సోనియాతో పాటు మొత్తం ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీల్ని సైతం నిందితులుగా చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 403 (చరాస్తులను దుర్వినియోగం చేయడం) 420 (మోసం) ఉన్నాయి.
ఎఫ్ఐఆర్ లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్న వారిలో రాహుల్, సోనియాతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధిపతి సామ్ పిట్రోడా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు కూడా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన డోటెక్స్ అనే సంస్థ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కీలక వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్‌కు రూ.1 కోటి బదిలీ చేసిన షెల్ సంస్థగా గత దర్యాప్తులో అభియోగాలు నమోదు చేశారు.
