ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు తవ్వే దేశాలలో భారతదేశం ఒకటి. మార్చి 31, 2025 నాటికి మనదేశం మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి.
ఇందులో ఎక్కువ భాగం కర్ణాటకలోని బంగారు గనుల నుండి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ఐదు బంగారు గనులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ బంగారు గనులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే ఓ బంగారు గనిని గుర్తించగా.. దాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి వద్ద ఈ బంగారు నిక్షేపాన్ని గుర్తించగా.. దీన్ని డెక్కన్ మైనింగ్ సంస్థ హక్కులను చేజిక్కిచ్చుంది.
దీన్ని లీజుకు తీసుకున్న తర్వాత దేశంలో బంగారు గని నుంచి బంగారాన్ని వెలికి తీసే తొలి ప్రైవేట్ సంస్థ ఇదే కానుంది. అందుకు ఇప్పటికే కావాల్సిన పర్యావరణ అనుమతులు వచ్చేశాయని మైనింగ్ సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఆ అనుమతి రాగానే త్వరలోనే పూర్తిస్థాయిలో పనులు ప్రారంభిస్తామని డెక్కనే గోల్డ్ మైనింగ్ సంస్థ స్పష్టం చేసింది. జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి ఏటా 750 నుంచి 1000 కిలోల వరకు బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉన్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ వెల్లడించారు.
ఆంధ్రా ప్రజలకు చౌకగా బంగారం?
అయితే ఈ బంగారు గని వల్ల తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు. కానీ, బంగారం వెలికితీసినా ఇరు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు.
బంగారం ధరలు అనేవి ప్రపంచమార్కెట్‌ను లోబడి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లభించే బంగారం, డిమాండ్, ఇంటర్నేషన్ మార్కెట్, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి బంగారు గనిలో ఉత్పత్తి అయ్యే బంగారం భారత్‌లో కొంతమేర డిమాండ్‌ను మాత్రమే తీర్చగలుగుతుంది.
అందులోనూ జొన్నగిరి బంగారు గనిలో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమైనా ఏడాదికి కేవలం కనీసం 750 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుందని తెలుస్తోంది. అయితే భారతదేశం ఏడాదికి సుమారుగా 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తుంది. దీంతో పోలిస్తే జొన్నగిరి గనిలో ఉత్పత్తి చేసేబంగారం చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఈ ఉత్పత్తి వల్ల బంగారం దేశీయంగా సరఫరాను పెంచగలుగుతుంది తప్పా.. ధరలపై ప్రభావం చూపలేవు. అంతేకాకుండా భారత్ ఎక్కువగా దిగుమతులు మీద ఆధారపడి ఉంది. ఈ విధంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్ రేట్లు పెరిగితే ఆంధ్రప్రదేశ్‌లోనూ ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఏపీలోని జొన్నగిరి గనిలో బంగారం ఉత్పత్తి వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశమే లేదు.
