నేపాల్ లో సోషల్ మీడియా నిషేధం, అవినితి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ‘జెన్ జీ’ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు యాత్రికులు నేపాల్కు వెళ్లారు. అదే సమయంలో నిరసనలు చెలరేగడంతో ఖాట్మాండ్కు సమీపంలో వాళ్ల బస్సుపై పలువురు దుండగులు దాడి చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యాత్రికులు ఖాట్మాండులోని పశుపతి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ముష్కరులు ఆ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. బస్సులోని ప్రయాణికుల బ్యాగులు, మొబైల్ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనలో దాదాపు 8 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. అయితే ఆ ధ్వంసమైన బస్సు గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ సమీపంలో సొనౌలి సరిహద్దుకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఆ బస్సు యూపీకి చేరుకున్న అనంతరం దాని డ్రైవర్ మాట్లాడారు. మా బస్సు భారత్కు తిరిగి వస్తుండగా దుండగులు దాడి చేశారని పేర్కొన్నారు. బస్సు అద్దాలన్ని రాళ్లతో పగలగొట్టి తమ వస్తువులన్నీ ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు భారతీయులు నేపాల్లో చిక్కుకున్నారు. దీంతో కేంద్రం వాళ్లని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
next post
