అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ జాగృతి నేతలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.
‘సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎయిర్‌పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు.
‘నా తండ్రికి లేఖ రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాను. అయినా మార్పు రాలేదు. అందుకే ఈసారి లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. వ్యక్తిగతంగా తనకు ఎవరిమీదా ద్వేశం లేదు. నాకు అందరూ సమానమే. వ్యక్తిగతమైన ఎజెండా కూడా నాకేం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. కేసీఆర్(KCR) చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. ఇదివరకు నేను రాసిన ఏ లేఖ కూడా బయటకు రాలేదు. ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’ అని కవిత అనుమానం వ్యక్తం చేశారు.
‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వారి వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతున్నది. అంతర్గతంగా నేను రాసిన లేఖ ఎలా బయటకు వస్తుంది. నేను రాసిన లేఖ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య కార్యకర్తలు రాసిన లేఖల పరిస్థితి ఏంటి అనేది చర్చ జరగాలి. నేను రెగ్యులర్‌గా ఇచ్చే ఫీడ్ బ్యాక్.. అందులో స్పెషల్ ఏం లేదు. కానీ లేఖ బయటకు రావడం బాధాకరంగా ఉంది. లేఖను చూసి బీజేపీ, కాంగ్రెస్ సంబరపడుతున్నాయి. మా నాయకుడు కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. పార్టీలోని కోవర్టులను పక్కన పెట్టి ముందుకు పోతే పది కాలాల పాటు పార్టీ చల్లగా ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు నష్టం చేశాయి. కేసీఆర్‌తోనే తెలంగాణకు భవిష్యత్తు’ అని కవిత స్పష్టం చేశారు.
