వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైవిధ్యతను పెంపొందించడం కోసమే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేరుస్తున్నామని, ఈ వక్ఫ్ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని, అందువల్ల ముస్లిమేతరులతో సహా ఎవరి పనితీరు ప్రభావితం కాదని పేర్కొంది. వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడాన్ని అనుమతిస్తామని, అది కూడా ఇద్దరికే పరిమితం చేశామని స్పష్టం చేసింది. దీనివల్ల వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్లామిక్ స్వభావం విషయంలో రాజీ పడకుండా సమతూకంతో కూడిన పారదర్శక పాలనకు హామీ కల్పించబడుతుందని కేంద్రం పేర్కొంది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ కొనసాగింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవారు, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలను సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు వుంటే వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇందులో మతపరమైన అంశాల జోక్యమేమీ లేదన్నారు. “దానధర్మాలు ప్రతి మతంలో భాగమని, క్రైస్తవులు, హిందువులు, సిక్కులకు కూడా ఈ దాన వ్యవస్థ వుంది. వక్ఫ్ అనేది ఇస్లాంలో దాతృత్వం తప్ప మరొకటి కాదు. వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, అకౌంట్ ఖాతాలను ఆడిట్ చేయడం వంటి లౌకిక విధులను మాత్రమే నిర్వహిస్తుంది.
నేను ముస్లిమేతరులైన ఇద్దరు సభ్యుల గురించే చెబుతున్నాను. వక్ఫ్ బోర్డులలో ఇద్దరు ముస్లిమేతరులు వుండటం వల్ల ఏమి మారుతుంది. వక్ప్ Ûబోర్డుకు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు సంబంధం లేదు.’ అని మెహతా అన్నారు. “హిందూ ఎండోమెంట్ బోర్డులు మతపరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తాయని, వక్ఫ్ బోర్డు లౌకిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.” అని చెప్పారు.
ఇస్లాంకి సంబంధించిన ఎలాంటి మతపరమైన అంశాల విషయంలో వక్ఫ్ చట్టం – 2025 జోక్యం చేసుకోదని, కేవలం ముతవాలీ (వక్ఫ్ ఆస్తుల మేనేజర్) గురించే మాట్లాడుతోందని తెలిపారు. ముతవాలీలను ఎవరు నియమిస్తారని సిజెఐ ప్రశ్నించగా, వక్ఫ్ బోర్డేనని చెప్పారు. అయన ముస్లిమేతరుడు అయి వుండవచ్చా? అనగా వుండొచ్చునని, ఆయనకు ఎలాంటి మత పరమైన కార్యకలాపాలు వుండవని అన్నారు.
