పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ఆపరేషన్ నేపథ్యంలో పాక్ ప్రయోగించిన చైనీస్ డ్రోన్‌లను నేలకూల్చేందుకు కేంద్రం ఖరీదైన క్షిపణులు ఎందుకు వినియోగించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ (Congress) నేత విజయ్ వాడిట్టివార్ (Vijay Wadettiwar) ప్రశ్నించారు. నాగ్‌పుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఘర్షణ సమయంలో చైనా తయారుచేసిన 5వేల డ్రోన్లను పాకిస్థాన్ ప్రయోగించింది. వాటి ధర ఒక్కొక్కటి రూ.15వేలు మాత్రమే. వాటిని నేలకూల్చేందుకు రూ.15లక్షల విలువైన క్షిపణులను కేంద్రం ఎందుకు వినియోగించింది. ఆపరేషన్ నేపథ్యంలో మనకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఘర్షణలో జరిగిన నష్టాలను గురించి ప్రభుత్వాన్ని అడగటం కూడా తప్పా’ అని వాడెట్టివార్ ప్రశ్నించారు.
ఇక, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ఇదే అంశంపై పలుమార్లు మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో తెలపాలని విదేశాంగ శాఖను కోరారు. దీనిపై మౌనం వహించడం తగదన్నారు. అంతేకాకుండా.. ఈ ఆపరేషన్‌పై పాకిస్థాన్‌కు ముందే సమాచారం ఇచ్చామని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే, తమ వ్యాఖ్యలను రాహుల్ తప్పుగా అన్వయిస్తున్నారని ఆ తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఆపరేషన్‌కు ముందు.. ఉగ్ర చర్యలపై పాకిస్థాన్‌ను హెచ్చరించామని, ఆ తర్వాత దాడులపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
