వరంగల్: తన విధులలో నిర్లక్ష్యం వహించడంతో పాటు డిపార్ట్మెంటుకు చెడ్డ పేరు తీసుకువచ్చిన ఇన్స్పెక్టర్పై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది.
చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. తొమ్మిదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేయడంతో ఎఫ్ఐఆర్ కాపీ వైరల్ అయింది. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరో కేసులో నిందితురాలిపై పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా ప్రాథమిక విచారణలో తేలడంతో ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకున్నారు.
.మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఏడాది జనవరి 21న ఓ మహిళ భూమి కబ్జా విషయంపై వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ భూమిని ఆక్రమించారని, అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ జె. వెంకట రత్నం ఫిర్యాదులో ఉన్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ 47/2025లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు అవుతోంది. అయితే ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు వచ్చి బెదిరించడం ఎలా సాధ్యమని మృతుడి బంధువులు వచ్చి ప్రశ్నిస్తే నా ఇష్టం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

చనిపోయిన మనిషి ఇప్పుడు భూమి కబ్జా చేయడం ఏంటి, పైగా ఆ భూమిలో రాళ్లు పీకి పారేసి.. చంపేస్తానని బెదిరించడం సాధ్యమా అని చంద్రశేఖర్ బంధువులు ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే మీ మీద కూడా కేసులు నమోదు చేసి లోపల వేస్తానని బెదిరించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ నెలలో ఈ సంచలన కేసు హాట్ టాపిక్ అయింది.
9 ఏళ్ల కిందట చనిపోయి.. ఇప్పుడు కబ్జాలు చేస్తున్నాడా..!
ఉన్నతాధికారులు దీనిపై స్పందించి విచారణకు ఆదేశించారు. డబ్బు కోసం నిందితులతో కుమ్మక్కై, ఏ తప్పు చేయని వారిపై అన్యాయంగా కేసు నమోదు చేశారని వరంగల్ కమిషనర్ గుర్తించారు. అందులోనూ తొమ్మిదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి వచ్చి భూమి కబ్జా చేయడం ఏంటని తలపట్టుకున్నారు. ఫిర్యాదు అందుకున్నాక అందులోని వ్యక్తుల సమాచారం ఏంటో తెలుసుకోకుండా కేసులు నమోదు చేయడం, బాధితుడి తరఫు వారు వచ్చి విషయం చెప్పినా తప్పిదాన్ని సరిచేయకపోగా.. వారిపైనే కేసులు పెడతానని బెదిరించినట్లు గుర్తించిన పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసే సమయంలో కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదని, నిందితుడు బతికున్నాడా లేదా కూడా గుర్తించకుండా కేసు నమోదు చేయడపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
