హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరో పురోగతిని సాధించింది. హమాస్ చీఫ్ కమాండర్‌ను హతమార్చింది.
అతని మృతదేహాన్ని గుర్తించినట్లు సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ అవుట్ లెట్ అల్- హదత్ తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది.
ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
దీనికి కారణాలు లేకపోలేదు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది.
హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది ఇజ్రాయెల్. బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగుతోన్నాయి.

ఈ దాడుల్లో హమాస్ చీఫ్ కమాండర్ మహ్మద్ సిన్వర్ మరణించినట్లు అల్ హదత్ తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన యాహ్యా సిన్వర్ తమ్ముడే ఈ మహ్మద్సిన్వర్. యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు.
ఈ దాడుల్లో సిన్వర్‌తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా మరణించారని అల్ హదత్ తెలిపింది. సిన్వర్ మరణవార్తను ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. హమాస్ గాజా చీఫ్ చనిపోయి ఉండవచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించినట్లు ది జెరూసలేం పోస్ట్ పేర్కొంది.
కాగా- శనివారం అర్ధరాత్రి నుంచి గాజాపై వరుసగా మిస్సైల్ దాడులను సాగిస్తూ వస్తోంది ఇజ్రాయెల్. హమాస్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 103 మంది మరణించారు. వీరిలో సాధారణ పౌరులు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.
