పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను హర్యానాలోని అశోకా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
బీజేపీ యువజన విభాగం సభ్యుడు ఒకరు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. హర్యానా మహిళా కమిషన్ సైతం మహమూదాబాద్ వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.
కల్నల్ సోఫియా ఖురేషిని ప్రశంసిస్తున్న రైట్-వింగ్ సపోర్టర్లను మహమూదాబాద్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రశ్నించారు. ఇదే వ్యక్తులు మాబ్ లించింగ్, ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేత ఘటనల్లో బాధితులను గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని అన్నారు. కాగా, తన కామెంట్లను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ మహమూదాబాద్ ఆ తర్వాత వ్యాఖ్యానించారు.
మహమూదాబాద్ అరెస్టును హర్యానా పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ అజీత్ సింగ్ ధ్రువీకరించారు. కాగా, ప్రొఫెసర్ అరెస్టు వ్యవహారం ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఈ అరెస్టును ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగానో, స్త్రీద్వేషంతో కానీ చేసినవి కావని, తమ అభిప్రాయాలను చెప్పిన వ్యక్తులను పోలీసులు టార్గెట్ చేస్తు్న్నారని విమర్శించారు. ”హర్యానా పోలీసలుు ప్రొఫెసర్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినదే నిజమైతే అది న్యాయప్రక్రియను ఉల్లంఘించడమే అవుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో దేశవ్యతిరేకత కానీ, స్వీద్వేషం కానీ ఎక్కడా లేదు. కేవలం ఒక బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదుతోనే ఈ అరెస్టు చోటుచేసుకుంది” అని ఒవైసీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ అరెస్టు షాకింగ్‌గా ఉందని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సుభాషిణి అలీ వ్యాఖ్యానించారు. మహమూద్ కామెంట్లు ఆయన వ్యక్తిగతమని, సంస్థ అభిప్రాయం కాదని అశోక్ యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
