కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధి సుచిత్ర జంక్షన్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 82, 83 మల్లారెడ్డి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
2024 జూన్ రెండో వారంలో ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూమి విషయంలో పెద్ద వివాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి వీటిపై కేసులు విచారణ జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం సదరు భూమిని ఏడీ సర్వే చేయడానికి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోగా.. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సర్వే తీరుపై అభ్యంతరం తెలిపారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో అధికారులు మరోసారి నోటీసులు అందజేసి సర్వే చేస్తామని చెప్పడంతో తాత్కాలికంగా వివాదం సమసినట్లైంది.
వివాదం ఏమిటంటే ?
కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం సర్వేనెంబర్ 82/1/EEలో 2015లో కె సుధామ, మరో ఎనిమిది మంది 3,393 గజాల భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వారిలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పహాని ప్రకారం రిజిస్టర్ చేసుకున్న తరువాత ఆ భూమిని 2021లో సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అందరూ కలిసి విక్రయించారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం యజమాని 2024 మే రెండో వారంలో పొజిషన్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డిలు ఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో ఇరు వర్గాలు చెందిన వారు భారీగా అక్కడికి చేరుకొని ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
2024లో ఇరు వర్గాలపై కేసులు..
భూ వివాద ఘర్షణలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లపై పెట్ బషీరాబాద్ పోలీసులు మే 18 2024లో కేసు నమోదు. ఈ వివాదంపై రాయదుర్గం కు చెందిన సేరి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. తాను 2022లో సర్వేనెంబర్ 82/1/EEలో 3,393 గజాల స్థలాన్ని ఆదూరి లక్ష్మణ్ కుమార్, మధు రుద్ర, లింగారెడ్డి, రణధీర్ కుమార్, శంకర్, రామారావు, శ్రీకాంత్ కుమార్, మహమ్మద్ బషీర్, బేతి సుభాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు వద్ద నుంచి మొత్తం 11 ప్లాట్లుగా కొనుగోలు చేశానని తెలిపారు. తర్వాత ఆరు నెలలకు తన పేరు మీద వేరు వేరుగా రిజిస్ట్రేషన్స్ చేపించుకున్నానని, అప్పటినుంచి పొజిషన్లో ఉంటూ నవంబర్ 2022 నుంచి తన పేరుతో ఉన్న కరెంటు మీటర్ చెల్లింపులు కూడా చేస్తూ వస్తున్నానని తెలిపారు. ఆ ల్యాండ్‌లో ఇనుప రేకులతో ఫెన్సింగ్ నిర్మించుకోగా.. ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు తో పథకం ప్రకారం భూమిలోకి వచ్చి అక్కడ ఉన్న రేకుల ఫెన్సింగ్ ను కూల్చివేశారని, అడ్డువచ్చిన తనపై దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇరువురి ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 447, 427, 341, 353, 152, 147, r/w 149ల ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఇచిన్న ఫిర్యాదుతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు సెక్షన్ 447, 4 27, r/w 37ల ప్రకారం కేసు నమోదు చేశారు. జీడిమెట్ల గ్రామం సర్వే నెంబరు 82 పార్ట్‌లో ఉన్న మా భూమిలో వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఫోన్లు లాక్కొని సీసీ కెమెరాలు డిస్కనెక్ట్ చేసి రెండు జేసీబీలతో అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేసి, రేకుల ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాటి నుంచి సుచిత్ర మిల్ట్రీ కాంపౌండ్ వాల్ రోడ్డు లో ఉన్న మల్లారెడ్డి భూమి వివాదం కొనసాగుతూ వస్తుంది. శనివారం ఏడీ సర్వే చేసేందుకు రావడం, మరి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.
నోటీసులు తన పేరుపై రాకపోవడంతోనేనా?
ఇక ఏడీ సర్వే అర్ధాంతరంగా ఆగిపోవడంపై అధికార యంత్రాంగం మరొకరకంగా చెప్పుకొస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగానే ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆ నోటీసుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు లేకపోవడంతోనే ఆయన అభ్యంతరం తెలిపినట్లు చెబుతున్నారు. నోటీసులను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పై జారీ చేసినట్లు సమాచారం. కాగా తన పేరుపై నోటీసులు రాలేదనే ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పిన్నట్టు తెలుస్తోంది. సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో ఉన్న వివాదాస్పద భూమి ఇదే.
