ప్రపంచం ఓ వైపు శాస్త్రరంగంలో ముందుకు వెళ్తూ ఉంటే..మరో వైపు కొంతమంది చేసే పనులు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది..ఆధునిక యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను పాటిస్తూ ఎదుటి వారికి తీవ్ర వేదనను మిగులుస్తున్నారు… ప్రస్తుత పరిస్థితిల్లో ఉద్యోగ రీత్యా చాలా మంది పట్టణాలకు వలస వస్తున్నారు..కిరాయి ఇండ్లలో ఉంటున్నారు..అలాంటి వారి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు..అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే..బతికి ఉన్న వారు నరకం చూస్తున్నారు..
ఎందుకు అంటే అద్దె ఇంట్లో మృతదేహంను ఉంచడానికి యజమానులు ఒప్పుకోవడం లేదు..ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే…
తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది…అద్దె ఇంట్లో శవాన్ని ఉంచడానికి..అంత్యక్రియల కార్యక్రమం చేపట్టేందుకు,ఆ ఇంటి యజమాని అనుమతి లభించకపోవడంతో, చివరికి వైకుంఠధామంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…ఈ ఘటన చూస్తూ ఉంటే ఇక మీదట పట్టణాల్లో షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని అర్ధం అవుతుంది.. కామారెడ్డి జిల్లా ఘనపురం గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి, బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబ సభ్యులతో గత కొన్నాళ్ల కిందట సిద్దిపేటకు వచ్చి ఇక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.. ఆయన తండ్రి దత్తయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 11వ తేదీన మృతి చెందారు..ఈ విషయం ఇంటి యజమానికి తెలియడంతో ఇంటి వద్ద దత్తయ్య మృతదేహాన్ని ఉంచేందుకు నిరాకరించారు…కాగా తప్పనిసరి పరిస్థితిలో ఈ నెల 12వ తేదీన ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠధామంకి బయల్దేరి అక్కడే మధ్యాహ్న సమ యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు..తిరిగి సంతోష్ తన కుటుంబ సభ్యులతో తాను అద్దెకి ఉంటున్న ఇంటికి వెళ్దాం అని అనుకున్నా.. యజమాని నుంచి సరైన స్పందన లేక వైకుంఠధామంలోనే తలదాచుకుంటున్నారు.
వైకుంఠధామంలో ఉన్న ఓ షెట్టర్లో సంతోష్, అతని భార్య,10 ఏళ్లలోపు ఇద్దరు కుమార్తెలు, అతని తల్లితో కలిసి బిక్కుబిక్కు మంటూ ఉంటున్నారు..అతని పరిస్థితిని చూసి చలించిన వివిధ ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, వాసవి క్లబ్‌ల ప్రతినిధులు రూ. 51,911 సాయం, 50 కిలోల బియ్యాన్ని వైకుంఠ ధామంలో అందజేశారు..మరో వైపు తనకు తాత్కాలికంగా సదుపాయం కల్పించాలని సంతోష్ విన్నవిస్తున్నారు.
