యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈరోజు (మే 15న) ప్రపంచ సుందరీ మణులు సందర్శించారు. 9 దేశాలకు చెందిన 30 మంది పోటీ దారులు, సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకుని, దర్శించుకున్నారు.
ఈరోజు (మే 15న) ప్రపంచ సుందరీ మణుల విశిష్ట సందర్శనతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కన్నుల పండువగా మారిపోయింది. ప్రత్యేక సంప్రదాయ దుస్తుల్లో గురువారం సాయంత్రం ఐదు గంటలకు, 9 దేశాలకు చెందిన 30 మంది సుందరీమణులు ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదు, భక్తి, సాంస్కృతిక అంశాలను ఒకే వేదికపై ప్రదర్శించే అపూర్వమైన అనుభవంగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రోటోకాల్ అతిథి గృహంలో ఆలయ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ప్రొజెక్టర్ ద్వారా ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఆ తర్వాత సుందరీ మణులను ఆలయ సందర్శనకు తీసుకువెళ్లారు. అఖండ దీపమండపం వద్ద, వారు దీపారాధన చేశారు. కోలాటం, సాంప్రదాయ భజన, శాస్త్రీయ నృత్యాల మధ్య, తూర్పు రాజగోపురం చేరుకొని, ఆలయ ఆగ్నేయ ప్రాంతంలో ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.తూర్పు మహా గోపురం వద్ద వేద పండితులు వారికి స్వాగతం పలుకగా, తర్వాత త్రితల రాజగోపురం, ఆంజనేయస్వామి గుడి, ధ్వజస్తంభం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదంతో పాటు శ్రీలక్ష్మీనరసింహాస్వామి ప్రతిమ నమూనాతో సిద్ధం చేసిన జ్ఞాపిలను వారికి అందజేశారు.

ఆలయ శిల్పకళకు ప్రపంచ సుందరీ మణులు, మంత్ర ముగ్దులై చూసి అనేక ఫోటోలు దిగారు. కోలాటం, పాటలతో యువతులు నృత్యాలు చేయగా, వాటిని చూసి మైమరిచిపోయిన సుందరీ మణులు కోలాట కర్రలు తీసుకుని, కోలాటం పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. చివరకు అందరికీ చేతులు ఊపుతూ పలకరించి, చిరునవ్వులు చిందిస్తూ, ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలలో వసతి గృహానికి చేరుకున్నారు. అక్కడ, వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బస్సులలో తిరుగు ప్రయాణమయ్యారు.
