పలు కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసిన న్యాయవాది బందెల క్రాంతికుమార్, ఆయన న్యాయవాది సీఆర్ సుకుమార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘వేసవి సెలవుల్లో ఏ కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నాయి? వాటిని ప్రతివాదులుగా చేర్చడానికి భయం ఎందుక’ని ప్రశ్నించింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం వల్ల బాధితులు ఉంటే వారే కోర్టుకు వస్తారు. వారికి లేని బాధ మీకెందుకు? వాళ్లు తమ జీవితాలు బాగుపడాలని ఇష్టపూర్వకంగా తరగతులకు వెళ్తుండవచ్చ’ని పేర్కొంది. ఈ పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేయడానికి ఇది రాజకీయ వేదిక కాదని, కోర్టుకు సమాధానం చెప్పేటప్పుడు మర్యాదలు పాటించాలని హితవు పలికింది.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు కౌంటర్ వేసేలోపు వేసవి సెలవులు ముగిసిపోతాయని, అందువల్ల హైకోర్టు చూస్తూ ఊరుకోకూడదని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తరఫు న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదిస్తూ పిటిషనర్ ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పిటిషనర్ ఆయా కాలేజీలకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయన సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కౌంటర్ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
