Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు..శ్రవణ్‌ రావు అరెస్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు శ్రవణ్‌ రావును చీటింగ్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తన కంపెనీ నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఇస్తానని నమ్మించిన శ్రవణ్‌రావు.. హైదరాబాద్‌లోని అఖండ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీకి రూ.7.8 కోట్లు టోపీ పెట్టాడు. ఈ కేసులో మంగళవారం శ్రవణ్‌రావును విచారించిన సీసీఎస్‌ పోలీసులు, ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని మిథిలా నగర్‌లో ఉన్న అఖండ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఇన్‌రిథ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న శ్రవణ్‌ రావు 2022 జూన్‌లో వెళ్లారు. అక్కడ అఖండ డైరెక్టర్‌ ఆకర్ష్‌ కృష్ణను కలిశారు. బెంగళూరులోని సండూరులో ఉన్న ఎకోర్‌ ఇండస్ట్రీస్‌ తన ఆధీనంలోనే ఉందని, దానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు బురిడీ కొట్టించారు. ఎకోర్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ఇనుప ఖనిజం(ముడి ఇనుము) కొనుగోలు చేస్తే టన్నుకు రూ.300 లాభం ఉంటుందని నమ్మబలికారు. శ్రవణ్‌ మాటలు నమ్మిన అఖండ సంస్థ.. విడతల వారీగా రూ.కోట్ల విలువైన ఖనిజాన్ని కొనుగోలు చేసింది. తన అకౌంటెంట్‌ ద్వారా మెయిల్‌ చేయించి అఖండ నుంచి రూ.7కోట్ల పై చిలుకు డబ్బును తన ఖాతాలకు మళ్లించుకున్నారు. ఆతర్వాత సరుకు సరఫరా చేయలేదు. దీనిపై 2024 జూలైలో అఖండ సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా.. శ్రవణ్‌రావుతో పాటు ఎకోర్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఉమా మహేశ్వర్‌రెడ్డి, శ్రవణ్‌రావు అనుచరుడు వేదమూర్తితో కలిసి అఖండ సంస్థకు రూ.7.8 కోట్లకు పైగా టోపీ పెట్టినట్లు గుర్తించారు.

ఈ విషయమై వారిని నిలదీయగా.. శ్రవణ్‌ రావు విదేశాలకు వెళ్లారని, ఆయన భార్య స్వాతిరావు కంపెనీ బాగోగులు చూస్తున్నారని చెప్పారు. దాంతో బాధితులు ఆమెను కలవగా.. ఆ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చింది. ముందుగా రూ.50 లక్షలు అఖండ సంస్థ ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత మిగిలిన డబ్బు రూ.6.58 కోట్ల గురించి మాట్లాడటానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు విదేశాల నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న బాధితులు గత నెల 24న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రవణ్‌రావుకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సీసీఎస్‌లో శ్రవణ్‌రావును విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కాగా, ఈ కేసులో శ్రవణ్‌రావు భార్య స్వాతిరావును ఏ-4గా చేర్చారు.

Related posts

తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ కిశోర్..

M HANUMATH PRASAD

వృద్ధ రైతుపై ఏఎస్ఐ జులుం..

M HANUMATH PRASAD

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్టు.. పట్టుబడిన వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్

M HANUMATH PRASAD

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

M HANUMATH PRASAD

ప్రకటిత నేరస్థుడిగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌!

M HANUMATH PRASAD