సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా చివరి రోజు బాధ్యతలు నిర్వహించారు. మే 13తో ఆయన పదవీ విరమణ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. తాను న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఆఖరి రోజు కోర్టులో బెంచ్ కార్యలాపాలు ముగియగానే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మాజీ న్యాయమూర్తి, దివంగత జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా సమీప బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన సంజీవ్ ఖన్నా ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2024 నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సంజీవ్ ఖన్నా తర్వాత భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మే 14న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన CJIతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
