ఇస్లామిక్ నమ్మకాలకు అనుగుణంగానే తాము చేపట్టిన ఆపరేషన్‌కు ” బున్యానుమ్ మార్సూస్” (Bunyanum Marsoos) అనే పేరు పెట్టినట్టు పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ (DG-ISPR) అహ్మద్ షరీఫ్ తెలిపారు.
ఇస్లామ్ అనేది కేవలం సైనికుల విశ్వాసం మాత్రమే కాదని, ఆర్మీ శిక్షణలో ఒక భాగమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిగా భారత మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసుకుని పాక్ ప్రతిదాడులకు దిగింది. దీనికి ‘బున్యానుమ్ మార్సూస్’ అనే పేరు పెట్టినట్టు పాక్ ఆర్మీ ప్రకటించుకుంది.
పాక్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్‌కు ఇస్లామిక్ పదజాలం వాడటం, తెల్లవారుజామున దాడులకు దిగడం వెనుక ఉద్దేశంపై పాక్ జర్నలిస్ట్ ఒకరు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పాక్ ఆర్మీ శిక్షణలో ఇస్లాం ఒక భాగమని చెప్పారు. ”ఇది మా విశ్వాసం. విశ్వాసం, దైవభక్తి, దేవుని పేరుతో పోరాటం (ఇమాన్, తఖ్వా, జీహాద్ ఫి సబిలిల్లా) మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అది మా నినాదం. అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తే మా ఆర్మీ చీఫ్‌గా ఈ తరహా ఆపరేషన్లు నిర్వహిస్తారు” అని చెప్పారు. అల్లా మార్గంలో పోరాటం చేసే వారు దృఢమైన ఉక్కు గోడ వలే ఉంటారని చెప్పడానికే ఈ ఆపరేషన్‌కు ‘బున్యానుమ్ మార్సూస్’ అనే పేరు పెట్టామని వివరించారు. అల్లాకు, పాక్ ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ ఇటీవల కూడా తన వ్యాఖ్యలతో ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చారు. ఒసామా బిన్ లాడెన్‌తో తన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్‌కు సంబంధాలుండేవని ఆయన ఇటీవల తెలిపారు. పాకిస్థాన్ అణ్వస్త్ర శాస్త్రవేత అయిన మహమూద్.. 9/11 దాడులకు ముందు బిన్ లాడెన్‌ను కలుసుకునేందుకు ఆప్ఘనిస్థాన్ వెళ్లారు. ఆయనను సీఐఏ, ఎఫ్‌బీఐ ఇంటరాగేట్ చేసింది.
