Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్థాన్‌ అణు స్థావరాలను భారత క్షిపణులు తాకాయా?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తామన్న పాకిస్థాన్‌ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది?అప్పటిదాకా భారత్‌ – పాక్‌ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఉన్నపళంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్థాన్‌ అణు స్థావరాలను భారత క్షిపణులు తాకడమే ఇందుకు కారణమా అంటే.. అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌ అణుబూచికి ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చేందుకే ఆ దాడులను భారత్‌ కచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మే 9 అర్ధరాత్రి, 10వ తేదీన పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్‌ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్‌ న్యూక్లియర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. పాక్‌ చెప్పుకొంటున్న ప్రధానబలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్‌ సైనిక నాయకత్వం వెన్నులో వణుకుపుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనల్లో నిజానిజాలను ఇటు భారత్‌ గానీ, అటు పాకిస్థాన్‌ గానీ నిర్ధరించలేదు. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సహా సోషల్‌ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో ఇండియన్‌ ఆర్మీ ప్రిసిషన్‌ స్ట్రైక్స్‌ చేసింది. దానికి అతి చేరువలో పాక్‌ న్యూక్లియర్‌ కమాండ్‌ కంట్రోలు ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడమంటే పాకిస్థాన్‌ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్‌ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని రాండ్‌ కార్పొరేషనుకు చెందిన డెరెక్‌జే గ్రోస్మన్‌ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు. ఇది అన్ని లక్ష్యాల పైనా అత్యంత కచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని చెప్పడమేనని వివరించారు. అమెరికా జోక్యానికి ముందు భారత్, పాక్‌ ఘర్షణ అతిప్రమాదకరంగా ఉందని.. ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్దిచెప్పినట్లు ఆయన వెల్లడించారు.

భారత్‌ లక్ష్యం అదే

సర్గోదాలోని కీలక ఎయిర్‌బేస్‌ కిరానా హిల్స్‌ను భారత్‌ లక్ష్యంగా చేసుకొంది. కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులు, క్షిపణులు, డ్రోన్లతో అత్యంత కచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత్‌ అధికారిక ప్రకటన చేసింది. ఈ బేస్‌లోనే అణు వార్‌హెడ్లను సైతం పాక్‌ నిల్వ చేసి ఉంచింది. ఇక్కడ భారత్‌ దాడులను పాక్‌ పత్రిక ‘డాన్‌’ ధ్రువీకరించిందని ఈథన్‌ అనే ఓ పరిశీలకుడు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. పాక్‌ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని, అందుకే తొలుత వాషింగ్టన్‌ను పాక్‌ ఆశ్రయిస్తుందని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ గతంలో ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన పోస్టు చేశారు. దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్‌తో సంప్రదింపులు జరిపిందన్నారు. పాక్‌ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్‌ ఇప్పటికే తేల్చి చెప్పింది. చివరకు భారత్‌ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్‌ కాళ్లబేరానికి వచ్చినట్లుతెలుస్తోంది. భారత్‌ మొదటి లక్ష్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడమే కానీ, పాక్‌ సైనిక స్థావరాలు కాదు. లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్‌ అంగీకరించినట్లు సమాచారం.

3 గంటల్లో ఖేల్‌ ఖతం

11 పాకిస్థానీ వాయు స్థావరాలపై ప్రెసిషన్‌ స్ట్రైక్స్‌ను కేవలం 3 గంటల్లోనే పూర్తిచేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. వాటిలో నూర్‌ఖాన్‌ బేస్‌ ప్రధానమైంది. ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ సహా ఉన్నతస్థాయి జనరల్స్‌ ఇక్కడ భేటీ అవుతారు. గగనతల రీఫ్యూయలర్‌ ట్యాంకర్లు, భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి. అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫీఖీ బేస్‌. ఇక్కడ అత్యవసర ల్యాండింగ్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. మురీద్‌ బేస్‌లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు. సర్గోదాను పాక్‌ అణునాడిగా చెబుతారు. భొలారీ స్థావరంపై భారత్‌ చేసిన దాడిలో పాక్‌కు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్, నలుగురు వాయుసేన సిబ్బంది సహా 50 మంది చనిపోయారు. 20 శాతం మేర ఎయిర్‌ఫోర్స్‌ మౌలిక సదుపాయాలు, ఎఫ్‌-16, జేఎఫ్‌-17 ఫైటర్లు ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాలు నిల్వ ఉంచే జకోకాబాద్‌తోపాటు రాడార్స్‌ హిట్, సుక్కూర్, పస్రూర్, సియాల్‌కోట్, స్కర్దు, చునియాన్‌ స్థావరాలపై భారత్‌ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. కొన్నింటిని ధ్వంసం చేసేందుకు భారత్‌ సుఖోయ్‌ 30, బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులను వినియోగించింది.

Related posts

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు

M HANUMATH PRASAD

హమాస్ చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్: మిస్సైళ్ల వర్షం

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD

నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్

M HANUMATH PRASAD

ఇండియాపై దాడికి నవాజ్ రూపకల్పన చేశారన్న అజ్మా బుఖారీ

M HANUMATH PRASAD