తమిళ అగ్ర నటుడు విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విశాల్.. ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో ఆదివారం (మే 11) రాత్రి ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీలు జరిగాయి. చిత్తిరై (తమిళమాసం) వేడుకల్లో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు నిర్వహించిన ‘మిస్ కూవాగం 2025’ అందాల పోటీలకు ముఖ్యఅతిథిగా హీరో విశాల్ హాజరయ్యారు. ఇందులో భాగంగా విశాల్ వేదికపై అందరినీ పలకరిస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఏం జరిగిందో అర్ధంకాక కార్యక్రమానికి హాజరైన వారంతా గందరగోళానికి గురయ్యారు. వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో విశాల్ కోలుకుని కళ్లు తెరిచారు. అనంతరం అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి విశాల్‌ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.
సరిగ్గా కొన్ని నెలల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మద గజ రాజా’ ప్రమోషన్స్‌లో.. ఊహించని స్థితిలో విశాల్ కనిపించిన సంగతి తెలిసిందే. బాగా బక్కచిక్కిపోయి, బలహీనంగా.. వణుకుతూ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకుండా పీక్కుపోయి కనిపించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి. స్టేజ్‌పై కనీసం నాలుగు ముక్కలు కూడా ఆయన మాట్లాడలేకపోయారు. దీంతో అప్పట్లో ఆయన విశాల్ ఆరోగ్యంపై తీవ్ర చర్చ జరిగింది. అయితే నటుడి టీమ్ మాత్రం వాటిని కొట్టిపారేసింది. వైరల్ ఫీవర్ సోకిందని, తీవ్రస్థాయిలో జ్వరం ఉండడమే అందుకు కారణమని వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అయితే తాజాగా జరిగిన ఈవెంట్‌లో విశాల్ కాస్త కొలుకున్నట్లు కనిపించినా ఇలా ఉన్నట్లుండి కళ్లు తిరిగిపడిపోవడంతో అసలు విశాల్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షించిన వైద్యులు విశాల్‌కు కొన్నాళ్లు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని, భోజనం చేయడం మానేయకపోవడమే మంచిదని సూచించారు. విశాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో విశాల్ అనారోగ్యంపై తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది
