ఢిల్లీ :కల్కా-షిమ్లా నేషనల్ హైవేపై బుధవారం రాత్రి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలోని షోఘీ బారియర్ వద్ద హిమాచల్ ప్రదేశ్ పోలీసులు, ఢిల్లీ పోలీసు బృందాన్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
భారత్ మండపంలో జరిగిన AI సమ్మిట్ నిరసన కేసులో ముగ్గురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తరలిస్తున్న ఢిల్లీ పోలీసుల వాహనాలను స్థానిక పోలీసులు నిలిపివేశారు.
అసలేం జరిగింది?
ఢిల్లీ మరియు హర్యానా పోలీసులు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు షిమ్లా సమీపంలోని రోహ్రూలో ఒక రిసార్ట్‌పై దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా ఈ అరెస్టులు చేయడం ‘అక్రమం’ అని హిమాచల్ పోలీసులు వాదించారు.
అధికారుల మధ్య వాగ్వాదం
ఢిల్లీ ACP రోహిత్ మరియు షిమ్లా ASP అభిషేక్ మధ్య నడిరోడ్డుపైనే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
షిమ్లా ASP: “మీరు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చారా? అరెస్ట్ వారెంట్ ఏది? కాగితాలు చూపించండి.” అని ప్రశ్నించారు.
ఢిల్లీ ACP: “మేము ఉదయమే అరెస్ట్ చేశాం. మీరు మమ్మల్ని పదేపదే అడ్డుకుంటే నిందితులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టలేం. మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి.” అని బదులిచ్చారు.
చివరికి పోలీసులు ఏకపక్షంగా హైవేపై ట్రాఫిక్ ఆపివేయడంతో సామాన్య ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేశారు. “మీ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.. అరిచింది చాలు” అని ఒక పౌరుడు ACPపై మండిపడ్డారు.
చివరకు టీ, స్నాక్స్.. మరియు ట్రాన్సిట్ రిమాండ్
సుమారు గంటన్నర పాటు సాగిన ఈ గొడవ తర్వాత, ఢిల్లీ పోలీసు బృందాన్ని షోఘీ పోలీస్ పోస్ట్‌కు తరలించారు. అక్కడ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాతావరణం కాస్త చల్లబడింది. హిమాచల్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి, ఢిల్లీ పోలీసులు ‘ట్రాన్సిట్ రిమాండ్’ పొందారు.
ఢిల్లీ పోలీసులపై కిడ్నాపింగ్ కేసు
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. నిందితులను తీసుకెళ్లిన రిసార్ట్ యజమాని ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులపై హిమాచల్ పోలీసులు ‘ట్రాస్‌పాసింగ్’ మరియు ‘కిడ్నాపింగ్’ కేసులు నమోదు చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లోపలికి చొరబడ్డారని హోటల్ యజమాని ఆరోపించారు.
సుఖు ప్రభుత్వం రియాక్షన్
హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సలహాదారు నరేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు ఎటువంటి నిబంధనలు పాటించలేదని, ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని విమర్శించారు. కనీసం లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిందితులను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు.
