భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్-19 భారత జట్టుకు సంబంధించి ఒక కీలక పరిణామాన్ని ప్రకటించింది. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన కోసం 14 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా కెప్టెన్‌గా నియమిస్తూ జూనియర్ క్రికెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ పర్యటనలో భాగంగా జనవరి 3 నుండి 7 వరకు దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. క్రమం తప్పకుండా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆయుష్ మ్హత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా ఇద్దరూ మణికట్టు గాయాల కారణంగా ఈ పర్యటనకు దూరం కావడంతో, బీసీసీఐ వైభవ్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది.
ఇటీవల డొమెస్టిక్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులే అతనికి ఈ నాయకత్వ బాధ్యతలు దక్కేలా చేశాయి. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, దక్షిణాఫ్రికా సిరీస్ వరకు మాత్రమే వైభవ్ కెప్టెన్‌గా ఉంటాడని, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 ప్రపంచకప్ 2026 కు మాత్రం గాయం నుంచి కోలుకున్నాక ఆయుష్ మ్హత్రే తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ప్రపంచకప్ జట్టులో కూడా వైభవ్ సభ్యుడిగా ఉన్నాడు.
