సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షి్‌ప)పై స్పష్టత ఇస్తూ అలహాబాద్ హైకోర్టు రెండు తీర్పులు వెలువరించింది.
వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదే పని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా, మరో జంటకు మాత్రం ఆ సౌకర్యాన్ని నిరాకరించింది. ఈ సందర్భంగా సహజీవనం పరిఽధులను నిర్ణయిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం వేరువేరు తీర్పులు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న తమను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదంటూ 12 మంది మహిళలు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. వారికి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశిస్తూ సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నచ్చనంత మాత్రాన ఈ విధానాన్ని చట్టవ్యతిరేకమైనదిగా భావించలేమని తెలిపారు. ”మానవ జీవన హక్కును అన్నింటికన్నా ఉన్నత స్థానంలో నిలపాల్సిన అవసరం ఉంది. వివాహం చేసుకోలేదన్న కారణంతో భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కును వీరికి నిరాకరించకూడదు” అని పేర్కొన్నారు. ”వారు మేజర్లు. వివాహం చేసుకోకుండానే కలిసి జీవించాలని అనుకుంటున్నారు. వారి నిర్ణయంపై తీర్పు చెప్పడం కోర్టుల పని కాదు” అని తెలిపారు. సహజీవనాలను సమాజం ఆమోదించకపోగా, నేరంగా పరిగణిస్తుందన్న విషయాన్ని న్యాయమూర్తి అంగీకరించారు. ”అయితే పాశ్చాత్య భావాలను స్వాగతించడానికి భారత దేశం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్‌షి్‌ప కూడా అలాంటి భావజాలమే. ఇది కొందరికి ఇది అనైతికత ప్రవర్తన. మరికొందరికి మాత్రం అనుకూల జీవనానికి ఆమోదయోగ్యమైన మార్గం” అని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు.
మొదటి భార్యకు విడాకులివ్వకుండా కుదరదు
మరో కేసులో ఇదే న్యాయమూర్తి తీర్పు చెబుతూ విడాకులు తీసుకోకుండా వివాహితులు సహజీవనం చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని తెలిపారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ సహజీవనం చేస్తున్న ఓ జంట చేసిన వినతిని తిరస్కరించారు. ఈ జంటలో పురుషునకు ఇది వరకే పెళ్లి జరిగింది. భార్య కూడా ఉంది. తాము మేజర్లమయినందున సహజీవనం చేస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. ”వ్యక్తిగత స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీ కాదు. భార్యకు ఉన్న చట్టబద్ధ హక్కులను తీసివేయలేరు” అని స్పష్టం చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా సహజీవనం చేయడం కుదరదని, అలాంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ కల్పించలేమని తెలిపారు.
