నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2′ సినిమా విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కావాల్సిఉంది.
కానీ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
“భారీ హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదు. ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయం. సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతీ అభిమాని నిరాశను మేము అర్థం చేసుకోగలం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ జాప్యానికి, అసౌకర్యానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వివరించింది. “మీ మద్దతే మాకు కొండంత బలం. త్వరలోనే ఒక సానుకూల అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో భరోసా ఇచ్చారు.
