రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిజామాబాద్ జిల్లా సీసీఎస్ కానిస్టేబుల్ (Nizamabad constable) ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
గత అర్థరాత్రి 2 గంటల వరకు పోస్ట్ మార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని ఇవాళ తెల్లవారు జామున బంధువులకు అప్పగించారు. మృతదేహం అందగానే వెంటనే బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా ఈ నెల 17న వాహనాల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తరిగబడిన రియాజ్.. సీసీఎస్ పోలీస్ ప్రమోద్‍పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు. ఆతర్వాత పోలీసులకు చిక్కిన రియాజ్ ఆసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్సపొందుతూ నిన్న తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానిస్టేబుల్ దగ్గర వెపన్ లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పుల జరపగా ఈ ఘటనలో రియాజ్ (Riyaz encounter) చనిపోయారు.
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి:
మరోవైపు రియాజ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక (human rights forum) డిమామండ్ చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ను హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరపాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘిచిన వారు ఎంతటి వారైనా, వారికి శిక్ష పడేలా చేయాలని, ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్యా నేరం మోపాలని డిమాండ్ చేశారు.
