Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

బీహార్‌లోనూ రేవంత్‌ చిచ్చు

బిహారిల డీఎన్‌ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్‌ పలికిన పలుకుల ప్రభావం ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది.
బూతు మాటలలో రేవంత్‌ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ్రెస్‌ హై కమాండర్‌ సోనియా గాంధీకి తెలియనిది కాదు. సోనియాను బలిదేవతగా అభివర్ణిస్తూ గతంలో రేవంత్‌ అనేకసార్లు విరుచుకుపడ్డారు. ఏమైతేనేం కాంగ్రెస్‌ సీనియర్లను వెనక్కిపంపి రేవంత్‌తో పప్పు అని కీర్తించబడిన రాహుల్‌గాంధీ, బలిదేవత అని కితాబు పొందిన సోనియా గాంధీ కరుణతో రేవంత్‌కు సీఎం పదవి దక్కింది.

నాయకులనే కాదు, మీడియాను సైతం మీ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోండి అని విలేకరుల సమావేశంలోనే అనేక సార్లు దూషించారు. అయినా అదృష్టం కలిసివచ్చి రేవంత్‌రెడ్డికి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు మీడియా మద్దతు కూడా లభించింది. వీరిని తిట్టినట్టుగానే బీహారీలను కూడా డీఎన్‌ఏ అంటూ తిట్టాడు. వీళ్లంతా తుడుచుకున్నట్టు బీహారీలు తుడుచుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి తిట్లను ప్రశాంత్‌ కిషోర్‌ రోజూ గుర్తుచేస్తూనే ఉన్నారు. అదేదో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి రేవంత్‌ రెడ్డి మాటలను ప్రశాంత్‌ కిషోర్‌ ఇలా గుర్తుచేస్తున్నాడని కాదు. బీహారీల డీఎన్‌ఏ గురించి రేవంత్‌ అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో అప్పటినుంచి ప్రశాంత్‌ కిషోర్‌ వదలడం లేదు. బీహారీల గురించి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌ అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకొని బీహారీల ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. రేవంత్‌రెడ్డి తన బూతు మాటలతో ఎక్కడో ఉన్న బీహార్‌లో కూడా పార్టీ కొంపలు ముంచుతున్నరు.

ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్నికల వ్యూహకర్త మాత్రమే కాదు, జన్‌ సూరజ్‌ పార్టీ ద్వారా బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొంతమంది ఎన్నికల ముందు హడావుడిగా రాజకీయ పార్టీలు ఏర్పాటుచేస్తారు. ప్రశాంత్‌ కిషోర్‌ అలా కాదు. 2022, అక్టోబర్‌ 2న జన్‌ సూరజ్‌ యాత్ర పేరుతో బీహార్‌లోని చంపారన్‌ జిల్లా నుంచి ప్రారంభించి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర జరిపారు. బీహార్‌ ఎందుకు వెనుకబడి ఉంది, బీహార్‌ సమస్యలు ఏమిటని ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ జనంలో కలిసిపోయారు. జన్‌ సూరజ్‌ పేరుతో పాదయాత్ర చేసి 2024, అక్టోబర్‌ 2న జన్‌ సూరజ్‌ పార్టీ ఏర్పాటుచేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అని కాదు. కానీ, బీహార్‌ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపగలరు. నిజానికి బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీనే ప్రధానమైన పార్టీ అని కూడా కాదు.
ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్టుగా బీహార్‌లో కాంగ్రెస్‌ ఉనికి నామమాత్రమే, సొంతంగా పోటీ చేయలేదు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దయతో విదిల్చిన సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నదని ఆయన కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ తనకు చేసిన మేలుకు కృతజ్ఞతగా లాలూ కొన్ని సీట్లు వదిలితే వాటిలో పోటీ చేస్తుందని ఒకవైపు చెప్తూనే మరోవైపు బీహారీల ఆత్మగౌరవాన్ని అవమానించిన రేవంత్‌రెడ్డితో క్షమాపణ చెప్పించాల్సిందే అని పట్టుబడుతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ, ఆయన ఉపన్యాసాలు బీహారీ ఓటర్ల మీద ప్రభావం చూపుతాయి. కాంగ్రెస్‌ను దెబ్బతీస్తాయి.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నారు, బీసీ కులగణన చేశారని రేవంత్‌రెడ్డి బీహార్‌లో ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు ఉపయోగ పడుతుందని రేవంత్‌ రెడ్డితో బీహార్‌లో ప్రచారం చేయించారు. పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం తరపున బీహార్‌ మీడియాలో ప్రకటనలు కూడా ఇప్పించారు. ఒకవైపు కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌ మీద ఆశలు పెట్టుకొంటే మరోవైపు ప్రధానంగా ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ ఆశల మీద నీళ్లు చల్లుతూ రేవంత్‌ రెడ్డి చేసిన బీహార్‌ డీఎన్‌ఏ వివాదాస్పద వ్యాఖ్యలను తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ వారికీ, తెలుగువారికి ఆత్మగౌరవం ఉన్నట్టే బీహారీలకు ఉంటుంది. సరైన నాయకులు లేక ఇలా ఉన్నారు కానీ, ఒకప్పుడు నలంద విశ్వ విద్యాలయం ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించినవారు. మగధ కేంద్రంగా అనేక రాజ్యాలను పాలించినవారు. వారిలో ఆత్మగౌరవం తట్టిలేపడం పెద్ద కష్టమేమీ కాదు. రేవంత్‌రెడ్డికి పెద్ద రాజకీయ చరిత్ర లేదు, యాక్సిడెంటల్‌ సీఎం అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డిపై మండి పడుతున్నారు. బీహార్‌ డీఎన్‌ఏ గురించి రేవంత్‌ రెడ్డి చేసిన వాఖ్యల పట్ల ఒక్క ప్రశాంత్‌ కిషోర్‌ మాత్రమే స్పందిస్తున్నారా? ఇతర పార్టీలు, మీడియా పట్టించుకోవడం లేదా అని ఇంటర్‌ నెట్‌లో సెర్చ్‌ చేస్తే జాతీయ మీడియాతో పాటు బీహార్‌కు చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి మాట తీరును తీవ్రంగా విమర్శించారు. రెండేండ్ల కిందట రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడే బీజేపీ జాతీయ నాయకులు రవిశంకర్‌ ప్రసాద్‌ ఖండించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై 2023, డిసెంబర్‌ 7న నవభారత్‌ టైమ్స్‌, ఎకనామిక్‌ టైమ్స్‌, ఆ మరుసటి రోజు ఆజ్‌తక్‌ మండిపడ్డాయి. ఇక బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. గత నెల 26న హిందీ ఛానల్‌ న్యూస్‌ 18 ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపైనర్‌గా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దించింది. ఆరు హామీలు తెలంగాణలో అద్భుతంగా అమలు చేస్తున్నామని కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వ ఖర్చుతో మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చారు. మహిళకు నెలకు రెండున్నర వేలు ఇవ్వడంతో పాటు హామీలన్నీ అమలుచేస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంది. కానీ, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఒక్క మహిళకు కూడా రెండున్నర వేలు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌తో పాటు మిగిలిన పక్షాలు ఆధారాలతో బదులిచ్చాయి. మహారాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ రానంత మెజారిటీ బీజేపీ మిత్రపక్షాల కూటమికి లభించింది. బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భవిష్యత్తు నవంబర్‌లో తేలుతుంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో బీజేపీ కూటమిదే పైచేయిగా ఉన్నది. కాంగ్రెస్‌ సొంత బలం అంతంత మాత్రమే.

Related posts

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

M HANUMATH PRASAD

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

M HANUMATH PRASAD

లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD

తెలంగాణ సీఎస్ ను జైలుకు పంపాల్సి వస్తుంది..: కంచ గచ్చబౌలి భూములపై సిజెఐ జస్టిస్ గవాయ్ సీరియస్

M HANUMATH PRASAD

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు..శ్రవణ్‌ రావు అరెస్టు

M HANUMATH PRASAD