ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐహెచ్ఎఫ్ఎల్)పై ఓ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ, సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సీబీఐ ప్రవర్తనను మేము అంగీకరించం. అత్యున్నంత న్యాయస్థానం నోటీసు జారీ చేసిన తర్వాత, వారు ఇక్కడికి రావాలి. సుప్రీంకోర్టు ముందు హాజరు కాలేమని ఎలా చెప్పగలరు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
కంపెనీకి చెందిన ప్రమోటర్లు నిధులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోసం దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వీచరిస్తోంది. ఈ సందర్భంగా.. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటువంటి నేరం జరగనందున తాము చర్యలు తీసుకోలేమని చెప్పిందని అన్నారు. అనంతరం కేసు నమోదు చేయాలని సీబీఐని కోరుతూ ఓ దరఖాస్తు దాఖలైంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరోపణల స్వభావం దర్యాప్తు, కేంద్ర సంస్థల నివేదిక అవసరమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐకి నోటీసులివ్వగా, కోర్టుకు హాజరు కాలేదు.
సీబీఐ వారు కోర్టుకు రావడానికి కూడా ధైర్యం లేదా అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, అందుకు వారం గడువు కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదికి, సీబీఐ చర్యలు తీసుకునేందుకు అధికారిక ఫిర్యాదు అవసరంలేదని, ఇంకా అదనపు సమాచారం ఏమివ్వాలి? ఇప్పటికే వారి వద్ద రికార్డులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఇక, ఇండియాబుల్స్ తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. కంపెనీ కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దానిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు. ఈ కేసును తదుపరి జూలై 30న విచారించనున్నట్టు కోర్టు పేర్కొంది.