ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఓటర్ల రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే.
మొత్తం 243 స్థానాలు ఉన్నాయి బిహార్ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. దీన్ని అందుకోవడానికి అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ కూటములు పోరాడుతున్నాయి.
బిహార్ రాజకీయ ముఖచిత్రంపై కొత్తగా వెలిసిన జన్ సురాజ్ పార్టీ సైతం ఓటర్లను ఆకట్టుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. జనంలోకి దూసుకెళ్తోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నెలకొల్పిన పార్టీ ఇది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఈ పార్టీని స్థాపించారాయన.
ఆవిర్భావం నుంచీ జనంలోనే ఉన్నారు. పాదయాత్ర చేపట్టారు ప్రశాంత్ కిశోర్. బిహార్ బద్లావ్ పేరు దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తోన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జనసభలను నిర్వహిస్తోన్నారు. ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు.
నేపథ్యంలో తాజాగా ఆరాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం ఇందులో పాల్గొన్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రశాంత్ కిశోర్ గాయపడ్డారు. పాదయాత్రగా వెళ్తోన్న ఆయనను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన ఎగిరి కిందపడ్డారు. పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ఆయనను పార్టీ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం పాట్నాకు తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన క్షేమంగానే ఉన్నారని, నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని పార్టీ కోరింది.