ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు.
జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి.
ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిచంపేశాడు. హంతకుడి దాడిలో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు) ఘటనా స్థలిలోనే మృతి చెందారు.
ఘటన తర్వాత నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.