ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మరో కీలకమైన రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగాయి.
ప్రకాశం జిల్లాలో భూసేకరణ సమస్యలు పరిష్కారం కావడంతో రైలు మార్గం నిర్మాణం మరింత వేగవంతం కానున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న ఈ ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల కొరత ప్రధాన సమస్యలుగా మారగా.. కేంద్రం ఈ రైలు మార్గాన్ని ‘ప్రగతి’ కార్యక్రమంలో చేర్చి, ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ప్రతి 100 రోజులకు ఒకసారి సమీక్షించింది. దీంతో అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించారు.
ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పల్నాడు, పశ్చిమ ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ భూసేకరణపై ఫోకస్ పెట్టారు.. భూసేకరణపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేశారు. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు, కురిచేడు ప్రాంతాల్లో భూముల సేకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రైలు మార్గం వెళ్లే భూముల యజమానులకు సరైన పత్రాలు లేకపోవడంతో పాటుగా చనిపోయిన వారి పేర్ల మీద భూములు ఉండటం ఇబ్బందిగా మారింది. ఈ భూ సమస్యల వల్ల పరిహారం పంపిణీ ఆలస్యమైంది. అలాగే కొన్ని భూములపై కోర్టు కేసులు కూడా నడిచాయి. మొత్తానికి రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించారు.
ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా పరిధిలో రైలు మార్గం పొడవు 103 కిలోమీటర్లు ఉండగా.. ఈ మార్గం 5 మండలాల మీదుగా వెళుతోంది. అలాగే రైతుల నుంచి మొత్తం 1,923 ఎకరాల భూమిని సేకరించారు. ప్రకాశం జిల్లాలో ఈ రైల్వేలైను నిర్మాణానికి మార్గం సుగమమైందని.. పరిహారం పంపిణీలో ఉన్న ఇబ్బందులను తొలగించామని, భూ సమీకరణ ప్రక్రియను పూర్తి చేశామంటున్నారు. ఈ పనుల్ని మరింత వేగవంతం చేయునున్నారు. ఈ రైల్వే లైన్ క్లియర్ అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు.. అంతేకాదు కొత్తగా మరికొన్ని రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లడానికి మూడు రైల్వే మార్గాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ టు తిరుపతి వయా వరంగల్, ఖాజీపేట, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తిరుపతి.. మరో రూట్ హైదరాబాద్ టు తిరుపతి వయా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లొచ్చు. మరో రూట్ హైదరాబాద్ టు తిరుపతి వయా షాద్‌నగర్, గద్వాల్, కర్నూలు, గుత్తి, గుంతకల్లు, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లొచ్చు. ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు దూరం తగ్గుతుందంటున్నారు. హైదరాబాద్ టు నడికుడి.. అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతికి వెళ్లొచ్చు.