తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే ఏడాదిన్నర దాటిపోయింది. ఈ ఏడాదిన్నర సమయంలో ఎన్నో కేబినెట్ సమావేశాలు, మరెన్నో పీసీసీ సమావేశాలు, సీఎల్పీ సమావేశాలు ఇలా చాలానే జరిగి ఉంటాయి.
అయితే ఏ ఒక్క సమావేశంలోనూ మంత్రివర్గ సభ్యులపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. కనీసం అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటన కూడా లేదు. అయితే మొట్టమొదటిసారి మంగళవారం జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ తన మంత్రివర్గ సభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మంగళవారం గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్ మంత్రుల పనితీరు బాగోలేదని అందరి ముందే కుండబద్దలు కొట్టారు. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంటే…ఆయా జిల్లాల ఇంచార్జీ మంత్రులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్న రేవంత్ వాటిన్నింటినీ తానే పరిష్కరించాలన్నట్లు మంత్రులు పట్టించుకోకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా మంత్రులు తనకు సహకరించడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సమిష్టిగా కాకుండా ఎవరికివారుగా ముందుకు సాగితే ప్రభుత్వాన్ని నడిపేది ఎలా? 2028 ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడం ఎలా అని రేవంత్ మంత్రులను మీనాక్షి ముందే నిలదీశారు.
వాస్తవానికి రేవంత్ కేబినెట్ లోని ఏ ఒక్క మంత్రి కూడా పార్టీలో రేవంత్ జూనియర్ కాదు. జూనియర్ అన్న విషయాన్ని పక్కనపెడిడే…కాంగ్రెస్ లో ఆరితేరిన నేతలే మంత్రులుగా ఉన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ…ఇలా ఏ నేతను తీసుకున్నా కూడా వారంతా రేవంత్ కంటే కూడా అధిష్ఠానం వద్ద వెయిట్ కలిగిన నేతలే. ఒక్క సీతక్క మాత్రమే రేవంత్ తో కలిసి టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ లోని హేమాహేమీలను మందలించడం ఎలా అని రేవంత్ ఇంతకాలం వెనుకంజ వేశారేమో గానీ… మంగళవారం మాత్రం ఫుల్ క్లాస్ పీకారు.
కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని, సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏనాడూ రాజీపడబోనని అన్నారు. చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని.. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని అన్నారు.