Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

ఏపీ సీఎం కు తెలంగాణ సీఎం చురకలు

గొదావరి-బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని అన్నారు.

ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకోవడం వల్ల అవి పూర్తి కావని ఎద్దేవా చేశారు. గోదావరి బేసిన్ లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లోని 555 టీఎంసీలలో తెలంగాణలోని ప్రాజెక్టులు కట్టుకుంటామని.. ఇందుకు ఎన్ఓసీ ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు ఏపీ తీసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బనకచర్లపై విపక్ష ఎంపీల భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

“ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు. కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వివరించదలచుకున్నా. వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయట పడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కేసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తాం. కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

“21-9-2016 న ఢిల్లీ శ్రమ శక్తి భవన్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీరు మంత్రి హరీష్ రావు, ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారు. ఆ సమావేశంలో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడింది. ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి పంపిస్తా. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. 2019లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నాలుగుసార్లు సమావేశమై కేసీఆర్ రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించారు” అని సీఎం రేవంత్ వెల్లడించారు.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కెసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళుతోంది. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ ఆనాడు మాట్లాడారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం. ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారు. మేం వాదనలకు వెళ్లదల్చుకోలేదు.. అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జల శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశాం. మా ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. ఉన్నపళంగా హరీష్ బకెట్లో బురద తీసుకుని మాపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. హరీష్ గారు.. ఈ పాపానికి కారకుడు మీ మామనే. పాపాల భైరవులు మీరు కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్‌లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరని ఆ బురద మాపై చల్లాలని చూస్తున్నారు

వీళ్ళు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడలేదు. పాలమూరు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును వీళ్లు పూర్తిచేయలేదు. పదేళ్లలో పెండింగ్ లోనున్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందేది. కమిషన్ల కక్కుర్తితో లక్షకోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందివ్వలేదు. పదేళ్లు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. వాళ్ల ఇల్లు నింపుకునేందుకు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేం ప్రయత్నం చేస్తున్నాం. మేం కష్టపడి ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళ ముఖాల్లో పైశాచిక ఆనందం కనిపిస్తోంది. హరీష్ రావు హుందాగా వ్యవహరించాలి.. అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దు. ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు?

సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి మేం మీ ఫామ్ హౌస్ కే వస్తాం.. 50 వేల కోట్లు ఇవ్వండి.. ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తాం. అబద్ధాలతో బతుకు సాగదీయొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఈ విషయంలో మాకు ఎలాంటి శష-భిషలు లేవు.. సామ,దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నాం. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తాం.. అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను అనుసరిస్తూ కేంద్రానికి సమస్యలను వివరిస్తోంది. చంద్రబాబు నాయుడి గారికి సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయను కుంటే మీ భ్రమ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు మా ప్రణాళిక మాకుంది. చంద్రబాబు గారు… కేసీఆర్ చెప్పారని కాదు.. గోదావరి బేసిన్ లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండి. కేసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయి.

మేడిగడ్డ గుండెకాయ లాంటిది.. అది లేకపోతే ఆ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేదు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయి. ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీనికి కారణం కేసీఆర్ కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు మీరే కదా ఒప్పుకున్నది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్నట్టు మోదీకి చంద్రబాబు అవసరం ఉంది.. చంద్రబాబుకి గోదావరి జలాల అవసరం ఉంది. చంద్రబాబు గారు.. దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు.. మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావు. కృష్ణా, గోదావరి బేసిన్ లపై మా తెలంగాణ ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి మిగిలిన నీరును మీరు ఎలాగైనా వాడుకోండి. రేపు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి బనకచర్లపై మా అభ్యంతరాలను వివరిస్తాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అందరూ కలిసిరావాలని కోరుతున్నా. అఖిలపక్ష భేటీకి రాకుండా కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో ఆంతర్యం ఏంటి? రేపు మేం వెళ్లి కలుస్తామని తెలిసి ఇవాళ వెళ్లి కలవడం వెనక ఏం కుట్ర దాగుంది? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related posts

బక్రీద్ పండుగను ఎలాగైనా జరుపుకోండి… గోవధ జరిగితే ఊరుకునేది లేదు… : రాజా సింగ్ హెచ్చరిక…

M HANUMATH PRASAD

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. అఖిల్ పెళ్లికి ఆహ్వానం..!

M HANUMATH PRASAD

ప్రపంచ సంగీత దినోత్సవ కాంపిటీషన్ లో పాల్గొన్న చిరంజీవి అభినయ శివానంద

M HANUMATH PRASAD

యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకున్న..ప్రపంచ సుందరీమణులు

M HANUMATH PRASAD

150 కోట్లు స్వాహా చేసిన సెక్యూరిటీ సంస్థ

M HANUMATH PRASAD

లగేజ్ కోసం వెళ్లి చిక్కిన భయ్యా సన్నీ యాదవ్.. ఎన్ఐఏ కార్యాలయానికి తరలింపు

M HANUMATH PRASAD