ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి.
బీవీ శ్రీనివాస రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్లలపై తెలంగాణ హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. కేసులో ఇంతకు ముందుకు సీబీఐ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ.10 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని.. పాస్‌పోర్టును వెంటనే విచారణ అధికారులకు సరెండర్ చేయాలని ధర్మాసనం పేర్కొంది.
కాగా, జైలు శిక్ష సస్పెన్షన్ పిటిషన్‌పై మంగళవారం వాదనలు కొనసాగాయి. జనార్ధన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నళిన్‌కుమార్, నాగముత్తు వాదించారు. పిటిషనర్ ఇప్పటికే 50 శాతానికి పైగా అంటే మూడున్నరేళ్ల పాటు జైలు జీవితం అనుభవించారని కోర్టు విన్నవించారు. మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష మాత్రమే మిగిలి ఉందని.. ఈ దశలో శాసనసభ్యత్వం కోల్పోకుండా సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని వాదించారు. అయితే, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి గతనెలలో నోటిఫికేషన్ జారీ చేశారని.. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోలుకోలేని నష్టం కలుగుతుందని తెలిపారు. బెయిల్ విషయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీబీఐ.. జైలు శిక్షను సస్పెండ్ చేసే విషయంలో వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు మంజూరు చేసింది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను మినహాయించి.. మిగిలిన ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా తేల్చింది. వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.