సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత ఉలగనాయగన్ కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.305.55 కోట్లు.
కమల్ హాసన్ చిర ఆస్తులు (ఇమ్మూవబుల్) రూ. 245.86 కోట్లు కాగా.. చర ఆస్తులు (మూవబుల్) రూ. 59.69 కోట్లు. కమల్ హాసన్‌కు ఉన్న ముఖ్యమైన ఆస్తులలో చెన్నైలోని నాలుగు కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి, వీటి విలువ రూ.111.1 కోట్లు. అలాగే, ఆయనకు రూ.22.24 కోట్ల విలువైన వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. లగ్జరీ కార్లు, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న హై-ఎండ్ ప్రాపర్టీలు కూడా ఆయన ఆస్తుల్లో భాగంగా ఉన్నాయి.
ఇతర ఆసక్తికర అంశాలుగా కమల్ హాసన్ తన వృత్తిని “ఆర్టిస్ట్”గా పేర్కొన్నారు. ఆయన విద్యార్హతను “8వ తరగతి వరకు చదివినట్లు” అని అఫిడవిట్‌లో నమోదు చేశారు.
ఆదాయ వనరుల విషయానికి వస్తే, కమల్ హాసన్ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. ఆయన ఒక్కో సినిమా కోసం రూ. 100 కోట్లు పారితోషికం తీసుకుంటారని సమాచారం. సినీ రంగంతో పాటు, ఆయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, అలాగే ఆయన స్వంత ప్రొడక్షన్ హౌస్ అయిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కమల్ హాసన్, రాజ్యసభ నామినేషన్ సందర్భంగా తన సంపద వివరాలను పారదర్శకంగా ప్రకటించడం గమనార్హం.