ఖమ్మం జిల్లాలో సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళ ఎస్ఐ హరితపై పదిమంది యువకులు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి కల్లూరు మండలం తిరువూరు క్రాస్ రోడ్‌లోని చౌదరి హోటల్ వద్ద చోటుచేసుకుంది.
తల్లాడ మండలానికి చెందిన 11 మంది యువకులు ఆ రాత్రి హోటల్ వద్దకు వచ్చి చపాతీలు కావాలని కోరారు. అయితే అప్పటికే ఇంకా చపాతీల చేయలేదని హోటల్ సిబ్బంది తెలిపినందుకు ఆగ్రహంతో యువకులు హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ ఘర్షణకు దిగారు. ఈ ఘటనను గమనించిన హోటల్ యాజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించటం తో పాటు హోటల్ యజమాని అయిన మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబర్ 102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 BNS కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న రాయల రామారావు, తన అనుచరులతో మరల హోటల్ వద్దకు చేరుకొని గొడవ చేస్తుండగా సమాచారం అందుకున్న మహిళ ఎస్ఐ హరిత వెంటనే స్పందించి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. హోటల్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు ఆమెపై అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డారు. వారిలో ఓ వ్యక్తి మరింత దిగజారి, మహిళా ఎస్ఐ ను చేతితో నెడుతూ తోసివేయడమే కాక, బూతులు తిడుతూ దాడికి దిగాడు. ఇది చూసిన ఎస్ఐ హరిత తక్షణమే తన సిబ్బందితో కలిసి యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వారిపై కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేశారు. మొత్తం పదకొండు మందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందుతుడు రాయల రామారావు తో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు కాబడిన నిందితుల వివరాలు A1: రాయల రామారావు @ రాము తండ్రి నరసింహారావు(44), A2: కుసుమరాజు శ్రీకాంత్ తండ్రి తిరుపతిరావు (25), A3: గుడిపల్లి గోపి తండ్రి నరసింహారావు (25), A4: పాష్టం రామయ్య తండ్రి రంగారావు (30), A5: ఎర్నం రామకృష్ణ తండ్రి కృష్ణ (28), A6: తమ్మిశెట్టి సాయి తండ్రి తిరుపతిరావు (20), A7: గోగినేని తిరుమలరావు, A8:దగ్గుల శ్రీనివాసరెడ్డి, A9: ఎస్కే సైదులు, A10: ఏపూరి సాయి, A11: గుండాల రాంప్రసాద్ తండ్రి హుస్సేన్ (34) గతంలో రాయాల రామారావు పై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు సమాచారం.
ఘటనపై ప్రజా సంఘాల ఆగ్రహం
ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారి పై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొంటూ పలువురు ప్రజా ప్రతినిధులు, సంఘ సంస్థలు, మహిళా సంఘాలు స్పందిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులే ఇలా దాడికి గురవుతుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా పోలీస్ అధికారులకు గౌరవం కల్పించేలా చట్టాలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో వున్నా ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడం, మహిళా అధికారిపై దౌర్జన్యం గా ప్రవర్తించడం, మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం తో పాటు అసభ్య పదజాలం ఉపయోగించిన ఆ యువకులపై బి ఎన్ఎస్ చట్టం ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం మత్తులో దుర్మార్గంగా ప్రవర్తించే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
