అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది.
17 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ బౌలర్లు, పంజాబ్ కింగ్స్‌ను 182 పరుగులకే పరిమితం చేసి 6 పరుగుల తేడాతో విజయాన్ని సాధించారు.
ఈ విజయానికి పలు కారణాలు ఉన్నప్పటికీ, ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వారే కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి. వాళ్లు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కృనాల్ పాండ్యా
ఆల్‌రౌండర్ అయిన కృనాల్ పాండ్యా బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయినా, బౌలింగ్‌లో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తీసుకురావడంలో కీలకంగా నిలిచాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 పరుగులు), జోష్ ఇంగ్లిష్ (39 పరుగులు) వికెట్లు తీసి పంజాబ్ జట్టు పరుగుల ప్రవాహాన్ని ఆపాడు.
2. భువనేశ్వర్ కుమార్
సీనియర్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 17వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీవైపు మలుపు తిప్పాడు. నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్‌లను అవుట్ చేయడంతో పంజాబ్ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. ఆ రెండు వికెట్లు తీసిన దశలో పంజాబ్ విజయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, భువనేశ్వర్ ధాటికి తలపడలేకపోయింది.
3. విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి మరోసారి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. టాప్ ఆర్డర్‌లో త్వరగా వికెట్లు పడిపోయినప్పటికీ, జట్టుకు ఎన్నెముకగా నిలిచాడు. 35 బంతుల్లో 43 పరుగులు (3 బౌండరీలు) చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. టోర్నీ మొత్తంగా ఆర్సీబీ విజయాల్లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ లను ఆడాడు. ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. మ్యాచ్ గెలవడానికి అవసరమైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
ఈ గెలుపుతో ఆర్‌సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి అభిమానులకు ఆనందంలో ముంచెత్తింది.