పోలీసులంటే అంతే మరి..?. ఎక్కడికైనా, ఎప్పుడైనా.. ఎవరి ఇంటికైనా వెళ్లొచ్చు. అనుమతి అవసరం లేదు. అడ్డుకున్నా ఒప్పుకునేది లేదు. ఆడ, మగ అనే తేడా లేదు.
ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నెట్టుకుంటూ వెళ్లిపోచ్చు. అని ఈ వీడియో చూస్తే అర్ధమవుతోంది. ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేసిన దౌర్జన్య సాహసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో కేసు విచారణ నేపథ్యంలో ముగ్గురు పోలీసులు ఓ ఇంట్లో నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లారు. అక్కడున్న సీసీ పుటేజ్ కావాలని అడిగారు. అయితే ఆ ఇంట్లో మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంట్లోకి రావొద్దని పోలీసులను అడ్డుకుంది. దీంతో సదరు పోలీస్ ఒక్కసారిగా ఊగిపోయారు. ఆమె గుండెలపై చేతులు వేసి పదే పదే నెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అనుమతి ఉందా అని అడిగిన ఇద్దరు బాలురుపైనా దౌర్జన్యం చేశారు. తమకు అడ్డు వస్తే ఇంతే చేస్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏదైనా కేసు విచారణలో పోలీసులు వాళ్ల ఇంటికి వెళ్లడం కరెక్టేనని, కాని దౌర్జన్యం చేయడం తప్పు అని నెటిజన్లు అంటున్నారు. కొందరు ఖాళీలు ఇలా చేయడం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్నా ఇలాంటి చోటు చేసుకోవడం దారుణమని విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు పోలీసులు తెలపాలని కోరుతున్నారు. ఏదైనా కేసు విచారణలో ఎవరైనా సరే సహకరించాలని అటు బాధిత కుటుంబానికి కూడా సూచనలు చేశారు. కానీ మహిళ పట్ల పోలీస్ చేసిన దౌర్జన్యం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి వెళ్లి పోలీసులు తప్పు చేశారని మండిపడుతున్నారు. ప్రజలే కాదని.. పోలీసులు తప్పు చేసినా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన వారు సొంతవారైనా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.