ఆంధ్రప్రదేశ్ లో నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ మేరకు ఆదేశాలుజారీ అయ్యాయి. విపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ తాము అధికారంలోకి రాగానే వీటిని ప్రవేశపెడుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలి దశలో నలభై ఒక్క లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దశల వారీగా రెండు కోట్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఏపీడీసీఎల్ ఉత్తర్వులు జారీచేసింది. తొలి దశలో సీపీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని ముఖ్య నగరాలలో 10.28 లక్షల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు.
దశలవారీగా…
దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మాత్రమే కాకుండా వ్యాపార సంస్థలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రెండు కోట్ల స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా 25 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సీపీఎం నేతలు దీనిపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని, ప్రజల్లోచైతన్యం తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామని ఏపీ సీపీఎం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతుంది.
అదనపు ఛార్జీలు పడతాయంటూ…
ఎంత విద్యుత్తును వినియోగించుకుంటే అంతే ఛార్జీలు పడతాయని, ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అదనపు భారం పడబోదని చెబుతుంది. ఒక్కొక్క మీటరు,నిర్వహణకు సుమారు 13 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. గత ప్రభుత్వం అంగీకారంతో ఇప్పటికే నాలుగు రకాల సర్దుబాటు చార్జీల ద్వారా తొమ్మిది నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాలను కూటమి ప్రభుత్వం ప్రజలపై పడింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో దోపిడీకి సిద్ధమవుతోందని సీపీఎం నేతలు అంటున్నారు. ఇక వాయిదా పద్ధతుల్లో నెలకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ప్రతి వినియోగదారుడి వద్ద నుంచి మీటర్ అద్దె పేరుతో వసూలు చేస్తారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రీపెయిడ్ పద్ధతిలో…
దీంతో పాటు నే ప్రీపెయిడ్ పద్ధతిలో చార్జీలు చెల్లించాలి. సెల్ ఫోన్ తరహాలో రీఛార్జ్ చేయించుకోవాలి. పేద, మధ్యతరగతి ప్రజలు ముందుగా విద్యుత్ బిల్లులు చెల్లించటం అదనపు భారం, రీఛార్జ్ చేయించుకోకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ప్రీపెయిడ్ మీటర్ల వల్ల దేశంలో 23 లక్షల కోట్ల రూపాయలు ముందుగానే ప్రజలు చెల్లించవలసి వస్తుందని అంచనా ఉందని విపక్షాలు చెబుతున్నాయి. ఈ మీటర్ల ద్వారా అధిక విద్యుత్ వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెడతారు. ఇది మరింతగా ప్రజలపై భారం పడనుంది. దీనిపై ప్రజల్లో నెలొకొన్న సందేహాలకు ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ల బిగించే ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.