కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సంబరాలకు సిద్దమవుతోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదని ఆరోపిస్తూ దీనికి నిరసనగా 4న ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. దీనికి కౌంటర్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తమ శ్రేణులకు ఆందోళనలకు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా జూన్ 4న పీడ విరగడైన దినం నిర్వహించాలని పవన్ పిలుపు ఇచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ రోజు ఉదయం వేళ రంగువల్లుల పోటీలు, అలాగే సంక్రాంతి పండుగ కళ వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని, సాయంత్రం దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి దీపావళి పండుగ వేడుకలను చేసుకొందామని తెలిపారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు.
పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ .. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికలను వన్ సైడ్ నిర్వహించుకోవడానికి కుట్రలు పన్నితే, దాన్ని జన సైనికులు, వీర మహిళలు ఎదుర్కొన్న తీరు ఓ గొప్ప స్ఫూర్తి పాఠం అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేయాలనే కుటిల ప్రయత్నాలను జన సైనికులు, వీర మహిళలు ఎదురొడ్డి నిలబడి అడ్డుకున్నారన్నారు. అది పవన్ కళ్యాణ్ నేర్పిన తెగువ అన్నారు.
పదవుల కోసం పవన్ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని, చేయబోరని నాదెండ్ల తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు అనవసర విషయాల పట్ల చర్చ తీసుకురావద్దన్నారు. కూటమి ఎలా ముందుకు వెళ్లాలి, మరింతగా ప్రజాదరణ చూరగొనాలి అనే దానిపై ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం అయిన రాష్ట్ర పరిస్థితిని మరో 10, 15 సంవత్సరాలపాటు కూటమి ప్రభుత్వం చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఎక్కువయ్యారని, వారికి సోషల్ మీడియాలో తప్ప మరో పని ఉండదని మంత్రి తెలిపారు. అలాంటి వారితో, అలాంటి వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు.