వైసీపీ హయాంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాల్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ వాహనాలు, గమ్యస్థానాలకు చేరే క్రమంలో మొరాయించడం, కొన్ని వాహనాలు ప్రమాదాలకు గురవడం తెలిసిన విషయాలే.
ఆయా వాహనాల్ని నడిపే డ్రైవర్లు, లబ్దిదారులకు రేషన్ ఇచ్చేందుకు సిబ్బంది.. ఇలా ఖర్చు తడిసి మోపెడైపోయింది. వాహనం ధర అదనం. ఇదంతా ప్రజాధనమే. ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చన్నదానిపై పీహెచ్‌డీ చేసినట్లుగా దోపిడీకి తెరలేపింది అప్పటి వైసీపీ సర్కార్, రేషన్ డోర్ డెలివరీ వాహనాల పేరుతో.
ఇంతా చేసి, ఈ వాహనాలు నేరుగా లబ్దిదారుల ఇళ్ళ వద్దకు వెళ్ళి, రేషన్ అందించాయా.? అంటే, అదీ లేదు. వీధి చివర్న వాహనాలు నిలిపితే, ఆ వాహనం దగ్గర జనం క్యూ లైన్లుగా ఏర్పడి, రేషన్ సరుకుల్ని తీసుకోవాల్సి వచ్చేది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రేషన్ వాహనాల్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకుల్ని లబ్దిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.
మరోపక్క, రేషన్ వాహనాల రద్దుపై వైసీపీ, నానా రకాల విమర్శలూ చేస్తోంది. దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పించామని వైసీపీ చెబుతోంది. అయితే, రేషన్ వాహనాలు పొందినవారు సైతం, ఈ వాహనాల్లో రేషన్ విషయమై సంతృప్తిగా లేరు. వైసీపీ కార్యకర్తలకే రేషన్ వాహనాలు దక్కినా, వాళ్ళు సైతం, రేషన్ డోర్ డెలివరీపై విమర్శలు చేయడం గమనార్హం.
కాగా, రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి, రేషన్ తీసుకుంటున్న లబ్దిదారులు, గతంలో రేషన్ డోర్ డెలివరీ పేరు చెప్పి, వీధి చివర్న వాహనాలు నిలిపేవారనీ, అది ఇబ్బందికరంగా వుండేదనీ అంటున్నారు. ఇది వైసీపీ నిజంగానే పెద్ద ఎదురు దెబ్బ.
వాస్తవానికి, వైసీపీ ఓటమికి గల కారణాల్లో, ఈ రేషన్ డోర్ డెలివరీ కూడా ఒకటన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. డోర్ డెలివరీ.. అని ప్రచారం చేసుకుని, వీధి చివర్న జనాల్ని వాహనాల దగ్గర నిలబెట్టింది మరి వైసీపీ.