ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసి పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరింది.
పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(41 బంతుల్లో 87), నేహాల్ వధేరా(29 బంతుల్లో 48) దంచికొట్టడంతో పంజాబ్ జట్టు విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. జూన్ 3న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలేమిటో తెలుసుకుందాం.
శ్రేయస్ అయ్యర్ భీకర ఫామ్‌లో ఉండడం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. శ్రేయస్ అయ్యర్ కేవలం 41 బంతుల్లోనే 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రేయస్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. రీస్ టోప్లీ వేసిన 13వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. నెహాల్ వధేరా కూడా పోటాపడి బౌండరీలు బాదడంతో పంజాబ్ స్కోర్ పరుగెత్తింది.
ఒత్తిడిలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా చేతులెత్తేయడం
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త ఒత్తిడి తీసుకొచ్చింది. 72 పరుగులకే 3 వికెట్లు పడిపోయాడు. కానీ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(87), నేహాల్ వధేరా(48) దంచికొట్టడంతో ముంబై చేతులెత్తేయాల్సి వచ్చింది. పరుగుల వరద పారుతుండడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతులెత్తేశాడు. ఈ క్రమంలో విజయం పంజాబ్ జట్టును వరించింది.
బ్యాటింగ్‌లో రోహిత్ విఫలం కావడం
ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ కీలక మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుపై 81 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ హిట్ మ్యాన్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 8 పరుగులకే రోహిత్ శర్మ ఔట్ కావడంతో ముంబై జట్టు కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
బుమ్రా ఎక్కువ పరుగులు ఇవ్వడం
ఈ కీలక మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల ముందు ముంబై స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తేలిపోయాడు. జస్‌ప్రీత్ తన 4 ఓవర్లలో ఒక్క వికెట్ తీయకపోగా.. ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ బుమ్రా ఒకే ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు.
వికెట్లు తీసినా ఒత్తిడిలో అశ్వనీకుమార్ తడబడడం
ఈ కీలక మ్యాచ్‌లో ముంబై స్టార్ బౌలర్ అశ్వనీ కుమార్ ప్రియాన్ష్ ఆర్య, నేహాల్ వధేరా వంటి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. కానీ చివరి ఓవర్లలో అశ్వనీ కుమార్ తడబడ్డాడు. ఒత్తిడిలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. తన 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చాడు.
శాంట్నర్‌కు రెండే ఓవర్లు ఇవ్వడం
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో చాలా పెద్ద తప్పు చేశాడు. ఎంతో అనుభవజ్ఞుడైన, కంట్రోల్డ్‌గా బౌలింగ్ చేసిన మిచెల్ శాంట్నర్‌కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. మిగతా రెండు ఓవర్లు కూడా అవకాశం ఇచ్చి ఉంటే పంజాబ్ ను కాస్త కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీసేవాడు.