డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు.
డీఎస్సీ నిర్వాహణపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు. శ్యామల మాట్లాడుతూ….`డీఎస్సీ కోసం రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే ఈ డీఎస్సీ ప్రిపరేషన్‌కు 90 రోజుల సమయం పడుతుంది. ఒక్కో సిలబస్‌కు కనీసం ఐదు రోజులు సమయం కావాలని, ఈ కాల పరిమితిని పెంచాలని డీఎస్సీ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ అభ్యర్థనపై కించత్ కూడా స్పందించడం లేదు. టెట్ నిర్వహించిన తరువాత డీఎస్సీ నిర్వహించాల్సి ఉంది.
ఇవాళ టెట్ నిర్వహించకుండా డెరెక్ట్‌గా డీఎస్సీ పరీక్ష ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేదు. లక్షలాది మందికి ప్రయోజకరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వ వ్యవహారశైలి మారాలి.
డీఎస్సీ అభ్యర్థులకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి. డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోని కారణంగా నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. 45 రోజుల కాల పరిమితిని 90 రోజులకు పెంచాలి. ఒకే జిల్లాకు ఒకే ప్రశ్న పత్రం ఉండాలి. డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థనపై కూటమి ప్రభుత్వం స్పందించి..వారికి అండగా ఉండాలి` అని శ్యామల డిమాండ్ చేశారు.