ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ డాన్ అంటూ వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు హయంలో 25 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏడాదికి ఐదువేల కోట్ల రూపాయల చొప్పున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని కాగ్ స్వయంగా బయటపెట్టినట్లు వెల్లడించారు. లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడని గణేష్‌కుమార్ గుర్తు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..` దొంగే..
‘దొంగా…దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు.
మరోవైపు వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం… ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి.
గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. గత ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసింది. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే` అని వాసుపల్లి గణేష్‌కుమార్ విమర్శించారు.