భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు.
ఆమె కేరళ (Kerala) పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు.
కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి మల్హోత్రా పర్యటనకు టూరిజం డిపార్ట్‌మెంట్ స్పాన్సర్ చేసిందని సురేంద్రన్ ఆరోపించారు. మహ్మద్ రియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడని, ఆయన నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్‌కు స్పాన్సర్ చేసిందని చెప్పారు. ‘టూర్‌లో ఆమె ఎవరిని కలిసింది? ఎక్కడికి వెళ్లింది? అసలు ఆమె అజెండా ఏంటి? పాక్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు?’ అని సురేంద్రన్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్‌తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి.. డానిష్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను ప్రశ్నించారు. జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆమె అలా చేయకూడదని తెలిసి కూడా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందనే విషయం స్పష్టమైందని చెప్పారు.