సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్‌ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
గృహప్రవేశం చేసిన మరుసటి రోజే ఇంటిని నేలమట్టం చేయడంతో సదరు కుటుంబం రోడ్డున పడింది. వివరాలు ఇలా.. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని పలు సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేతలు చేపట్టారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కూల్చివేస్తున్నట్టు పైకి చెప్తున్నా.. ఇందులో రాజకీయ జోక్యం ఉన్నట్టు తెలుస్తున్నది. సర్వే నంబర్ 947లో గృహ ప్రవేశం చేసిన ఇంటితో సహా 10 ఇండ్లను అధికారులు కూల్చివేశారు. అందులో ఐలాపూర్ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు మల్లేశ్‌కు చెందిన ఇంటిని టార్గెట్ చేసుకొని కూల్చివేతలు చేపట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం గృహప్రవేశం చేయగా శుక్రవారం ఇంటిని నేలమట్టం చేయడంతో మల్లేశ్ కన్నీరుపెట్టుకున్నారు.
తనపట్ల కక్షగట్టి, కాంగ్రెస్ నాయకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం ఏమిటని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన దశలోనే అధికారులు నిలుపుదల చేసి ఉంటే ఇంతటి భారీ నష్టం వాటిల్లేది కాదని తెలిపారు. అప్పుడు మౌనం వహించి ఇప్పుడు చర్యలు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన అక్రమ ఇండ్ల నిర్మాణాలు జోలికి అధికారులు వెళ్లడం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.