రోడ్డు ప్రమాదమో.. హత్యో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర సంచలనం రేపింది. అతడి మృతి రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిందని పోలీస్ శాఖ ప్రకటించినప్పటికీ అతడిది హత్య అని రాజకీయ పార్టీలు..
ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారంపై తొలిసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రవీణ్ పగడాల మృతిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు
కోనసీమ జిల్లా చెయ్యేరులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలో తొలిసారి బహిరంగంగా ప్రవీణ్ పగడాల మృతిపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సహజ మరణాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను’ అని హెచ్చరించారు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ ఇదే రకంగా తనపై బురద చల్లారని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ‘ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే నాది డేగ కన్ను. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, డ్రోన్లు మీ వెనకాలే వెంటాడుతాయి, తోక కట్ చేస్తాయి’ అని తెలిపారు. ‘తిరుమలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారు. స్వార్థపరులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మొద్దు. ఎమోషనల్ కావొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌లో గతంలో ఇదే రకంగా హిందూ ముస్లింలను చంపి మత కల్లోలాలు సృష్టించారు. ప్రశాంతమైన కోనసీమలోను విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్‌లను పెంచాం. అధిక పింఛన్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టాలనే సంకల్పంతో పని చేస్తున్నాం’ అని తెలిపారు.