పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరసగా దాడులు చేస్తూ దాయాది దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టింది
ఉగ్రశిబిరాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను మట్టుపెట్టింది. అయితే పాకిస్థాన్ సైతం భారత్‌పై దాడికి దిగింది. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ యుద్ధంతో భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాక్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను సీడీఎస్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) కొట్టిపారేశారు. సింగపూర్‌లో శనివారం నాడు షాంగ్రి-లా-డైలాగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ దేశానికి సీడీఎస్ వెళ్లారు. ఈ సందర్భంగా బ్లూమింగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ అనిల్ చౌహాన్ కొట్టివేశారు. ఫైటర్ జెట్లు కోల్పోయిన మాట వాస్తవమేనని ఆయన పరోక్షంగా చెప్పారు. అయితే యుద్ధ విమానాలు నేలకూలిన అంశం ప్రధానం కాదని.. తప్పులు సరిదిద్దుకుని దాడులను తిప్పికొట్టామన్నదే ముఖ్యమన్నారు. అలాగే కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్యనూ సీడీఎస్ వెల్లడించలేదు. నాలుగు రోజుల యుద్ధంలో ఏ రోజూ అణుయుద్ధం వరకూ వెళ్లే పరిస్థితి రాలేదని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు ఏమి జరిగాయో తెలుసుకుని వాటిని సరి చేసి రెండ్రోజుల తర్వాత తిరిగి అమలు చేశామన్నారు. అలాగే అన్ని విమానాలను సుదీర్ఘ లక్ష్యాల వైపు మళ్లించామని చెప్పారు.
భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేశీయ యుద్ధవిమానాల సామర్థ్యంపై అటు కేంద్రం, ఇటు మిలటరీ అధికారులు నేరుగా స్పందించలేదు. ఈ క్రమంలో సీడీఎస్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మొదట్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ప్రకటించారు. అయితే న్యూఢిల్లీ మాత్రం అవుననీ, కాదనీ చెప్పలేదు. కాగా, భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండనున్నాయనడానికి పాకిస్థాన్‌పై జరిపిన ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. మోడ్రన్ వార్‌ఫేర్ అనేది ఇప్పుడు టెక్నాలజీ, సైబర్ ఆపరేషన్స్, సమాచారాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటోందన్నారు.