అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎంతో నాగార్జున దంపతులు కాసేపు ముచ్చటించారు.
గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత ఈ ప్రేమ పక్షులు పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల విదేశాలకు వెళ్లి జైనాబ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు
అఖిల్ – జైనాబ్ ల పెళ్లి జూన్ 6న జరగబోతుందని సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అఖిల్ ‘సిసింద్రీ’ చిత్రంతోనే బాలనటుడిగా వెండితెరపై కనిపించాడు. ఆ తరువాత 2015లో ‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘లెనిన్’ మూవీలో నటిస్తున్నాడు. కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.