వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు టెర్రరిస్టులు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు.
అందుకే ఇప్పటివరకూ ఆ ఉగ్రవాదులను మోదీ ప్రభుత్వం పట్టుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు.
శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ .. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలోనూ బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకే బీజేపీ వాళ్లను పట్టుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. ” పహల్గాం ఉగ్రవాదులు బీజేపీలో చేరి ఉండవచ్చు. అందుకే వాళ్లను బీజేపీ పట్టుకోవడం లేదు. ఏదో ఒకరోజు బీజేపీ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ వస్తుంది. అందులో పహల్గాం ఉగ్రవాదులు బీజేపీలో చేరారు అని ఉంటుంది” అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు రామ్ కథమ్ తీవ్రంగా ఖండించారు. రౌత్ వ్యాఖ్యలు హీనమైన చర్యగా అభివర్ణించారు. ఆయన మాటలు భారత త్రివిధ దళాలను కించ పరిచే విధంగా ఉన్నాయని అన్నారు. సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరికీ మైండ్ పనిచేయడం లేదని ఆరోపించారు. వాళ్లను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.
శివసేనకు చెందిన సంజయ్ నిరుపమాన్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని అన్నారు. నిజం ఏంటంటే.. శివసేన(యూబీటీ)పార్టీ బీజేపీలో చేరాలని అనుకుంటోంది. కానీ బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని తెలిపారు. దీంతో ఫ్రస్టేషన్ లో వాళ్లు మాట్లాడుతున్నారని సంజయ్ నిరుపమాన్ అన్నారు.