ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్ జగద్గురు స్వామి రామభద్రాచార్యను భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. మధ్యప్రదేశ్ చిత్రకూట్ లోని ఆశ్రమంలో రామభద్రాచార్య ఆశీస్సులు తీసుకున్నారు ఉపేంద్ర ద్వివేది.
ఈ సందర్భంగా రామ మంత్రాన్ని ఆర్మీ చీఫ్ కు ఉపదేశించారు రామభద్రాచార్య. ఈ మంత్రాన్ని హనుమంతుడికి సీతాదేవి ఉపదేశించింది. హనుమంతుడు లంకపై యుద్ధం చేయబోయే ముందు ఈ మంత్రం హనుమాన్ కు చెప్పింది సీతాదేవి.
ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్యను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ” ఆర్మీ చీఫ్ కు నా ఆశీస్సులు అందించాను. ఆ తర్వాత గురు దక్షిణ అంశం ప్రస్తావనకు వచ్చింది. నాకు గురు దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ అని అడిగాను. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది నా కోరికను ఒప్పుకున్నారు. పాకిస్థాన్ కు సరైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రామభద్రాచార్య పేర్కొన్నారు.
ఈ మేరకు ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్య తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.. తులసి పీఠ్ ధామ్ లోని తనను సందర్శించారని పేర్కొన్నారు. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. సన్యాసులు, విద్యార్థులతో సమావేశం జరిపి ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని వివరించారని తెలిపారు.
ఎవరీ రామభద్రాచార్య..?
ఆయోధ్య రామ జన్మభూమి- బాబ్రి మసీదు మధ్య న్యాయ పోరాటం సమయంలో ఆధ్యాత్మిక గురువు రామభద్రాచార్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీ రాముడి జన్మభూమి అయోధ్య మాత్రమే అని అలహాబాద్ హైకోర్టు ముందు నిరూపించడానికి ఆయన అనేక శాస్త్రీయమైన ఆధారాలు, గ్రంథాలను ధర్మాసనం ముందు ఉంచారు. రామభద్రాచార్య ఇచ్చిన అఫిడవిట్, ఆధారాలు కారణంగా అలహాబాద్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన సొంతం కావాలని కేవలం రామభద్రాచార్య మాత్రమే భావించడం లేదు. మే 29న జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పీఓకే ను తిరిగి తీసుకోవడంపై స్పష్టంగా తెలిపారు. ఏదో రోజు పీఓకేను భారత భూభాగంలో కలిపేస్తామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇక ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం కూల్చేసింది. ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణశాఖ పేర్కొంది