Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌

ఈ కేసులో మిగతా నిందితులకు ఇప్పటికే బెయిల్‌ మంజూరు

తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు

పలు షరతుల వల్ల పిటిషనర్‌ చట్టం నుంచి పారిపోలేరు

పోలీసులపై ఫిర్యాదు.. వారిని ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 కింద నిషేధం ఉంది

తీర్పులో స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు

సాక్షి, అమరావతి: ముంబయి సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీసు కస్టడీ, కేసులో పిటిషనర్‌ పాత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీఎస్సార్‌ ఆంజనేయులుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తే పిటిషనర్‌ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేకాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని, అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది.

మీడియాతో మాట్లాడకూడదు
ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందూ కూడా మాట్లాడటానికి వీల్లేదని పీఎస్సార్‌ ఆంజనేయులును హైకోర్టు ఆదేశించింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, చార్జిషీట్‌ దాఖలు చేసేంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది.

కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, కోర్టులో పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయరాదని హైకోర్టు చెప్పింది.

Related posts

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

M HANUMATH PRASAD

గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?

M HANUMATH PRASAD

నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం

M HANUMATH PRASAD

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం

M HANUMATH PRASAD

ఆపు నీ బెదిరింపులు–పవన్ పై చిట్టిబాబు ఫైర్..!

M HANUMATH PRASAD